ఇప్పటివరకు 57.41శాతం పోలవరం పనులు పూర్తి

cm review meeting by polavaram in monday

వర్షభావ ప్రాంతాల్లో పటిష్ట చర్యలు చేపట్టి చివరి ఆయకట్టు వరకు నీరు చేరేలా చర్యలు తీసుకోవాలని ఇరిగేషన్ శాఖ అధికారులను సీఎం చంద్రబాబు ఆదేశించారు. పోలవరం సహా ఇతర సాగునీటి ప్రాజెక్టులపై సమీక్షించిన ఆయన.. ఏపీలో ప్రస్తుతం 37వేల 500చిన్న తరహా చెరువులు ఉన్నాయని, 10లక్షల పంటకుంటలు నిర్మిస్తున్నామని తెలిపారు. అన్ని చెరువులను నింపడానికి ప్రణాళికలు రూపొందించాలన్నారు. మూడ్రోజులుగా వర్షాలు కురుస్తున్నా ఆంధ్రప్రదేశ్‌లో 14 శాతం లోటు వర్షపాతం ఉందన్నారు. ప్రజలకు నీటి భద్రత ఇవ్వాలని అధికారులకు సీఎం సూచించారు. ఉపరితల జలాలు, భూగర్భజలాలు సద్వినియోగం చేసుకోవాలని, సమర్థ నీటి నిర్వహణ ద్వారా నీటి కొరత అధిగమించాలని సూచించారు.

సోమవారాన్ని పోలవారంగా మార్చుకున్న ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు.. ప్రాజెక్టు పనుల పురోగతిపై సమీక్ష చేశారు. గడ్కరీ పర్యటన తర్వాత ఢిల్లీలో జరిగిన సమావేశాల వివరాలపైనా అధికారులతో చర్చించారు. సవరించిన పోలవరం అంచనాలపై కేంద్రం వెలిబుచ్చిన సందేహాలను క్లియర్ చేస్తుండాలని ఆదేశించారు. ప్రాధాన్యత క్రమంగా ప్రాజెక్టుల నిర్మాణాన్ని వేగవంతం చేయాలన్నారు. పోలవరంలో ఇప్పటివరకు 57.41 శాతం పనులు పూర్తి చేశామని జలవనరుల మంత్రి దేవినేని ఉమ తెలిపారు. ఎడమ కాల్వ పనులు 62 శాతానికి పైగా పూర్తయ్యాయని.. పురుషోత్తపట్నం ఎత్తిపోతల నుంచి ఏలేరుకు నీరు తీసుకెళ్లామని అన్నారాయన. పట్టిసీమనలో మాదిరి పురుషోత్తపట్నాన్ని అడ్డుకునేందుకు జగన్ కేసులు వేయించారని ఉమ ఆరోపించారు.

రాష్ట్రంలో జరుగుతున్న ఉపాధి హామీ పనుల పురోగతిపైనా చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. గత వారంలో 134 కోట్ల రూపాయల పనులు పూర్తి చేసినట్టు అధికారులు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకొచ్చారు. పంచాయతీ రాజ్‌ శాఖలో 33 శాతం నిధులు ఖర్చు చేశామని.. గృహ నిర్మాణ శాఖలో 31.35 శాతం నిధులు ఖర్చయ్యాయని తెలిపారు. చేసిన పనులకు బిల్లుల చెల్లింపులో జాప్యం ఉండకూడదని.. ఆ దిశగా జాగ్రత్తలు తీసుకోవాలని చంద్రబాబు అధికారులను ఆదేశించారు. మరోవైపు చంద్రబాబుతో రాజధాని రైతులు సమావేశమయ్యారు. తమ సమస్యలపై వినత పత్రం అందజేశారు. గ్రామ కంఠాల విషయంలో అధికారుల ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారని ఫిర్యాదు చేశారు.