వర్షాలకు తడిసిముద్దయిన ఉత్తరాంధ్ర.. నిండుకుండలా నీటి ప్రాజెక్టులు

heavy-rain-in-uttharandhra

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం, రుతుపవనాల ప్రభావంతో కురుస్తున్న వర్షాలకు ఉత్తరాంధ్ర తడిసిముద్దయింది. దక్షిణ కోస్తాలో అక్కడక్కడ భారీ వర్షాలు కురిశాయి. పలు జిల్లాల్లో వర్షాలకు ఈదురు గాలులు కూడా తోడయ్యాయి. చాలా చోట్ల సము ద్రం ముందుకు చొచ్చుకొచ్చింది. నాలుగు రోజులుగా పడుతున్న వానలకు తోడు.. ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న వరద నీటితో తెలుగు రాష్ట్రాల్లోని ప్రాజెక్టులు నిండుకుండలుగా మారాయి.

తెలంగాణతో పాటు ఛత్తీస్‌గఢ్, ఒడిశా రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తుండడంతో, కడెం, ర్యాలీ, గొల్లవాగు, ప్రాణహిత, ఇంద్రావతి, శబరి, తాలిపేరు, కిన్నెరసాని, సీలేరు వంటి ఉపనదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. దీంతో గోదావరికి వరద పోటెత్తింది. భద్రాచలం వద్ద గోదావరి నీటి మట్టం ప్రమాదకర స్థాయికి చేరుకుంది. ధవళేశ్వరం బ్యారేజీ నుంచి 4 లక్షల 35 వేల క్యూసెక్కుల నీటిని సముద్రంలోకి వదిలారు. గత మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలకు పోలవరం ప్రాంతంలో వరద ఉద్ధృతి కొనసాగుతోంది. కొత్తూరు కాజ్‌ వే పై నుంచి గోదావరి వరదనీరు ప్రవహిస్తోంది. దీంతో ఏజెన్సీలో 19 గ్రామాలకు రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. దీంతో జనం కష్టాలు రెట్టింపయ్యాయి.

కృష్ణానది ఎగువ పరివాహక ప్రాజెక్టుల నుంచి శ్రీశైలానికి వరద ప్రవాహం కొనసాగుతోంది. డ్యాం పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు. ప్రస్తుత నీటిమట్టం 871 అడుగులకు చేరింది. జూరాల జలాశయంలో విద్యుదుత్పత్తి ద్వారా 32,000క్యూసెక్కులు, తుంగభద్ర నుంచి 65,024 క్యూసెక్కుల నీరు చేరింది. విజయవాడ ప్రకాశం బ్యారేజీ నిండుకుండను తలపిస్తోంది. బ్యారేజీ 60 గేట్లను ఒక అడుగు ఎత్తి దాదాపు 50వేలక్యూసెక్కుల నీటిని సముద్రంలోకి విడుదల చేస్తున్నారు. గత నాలుగైదేళ్లలో ప్రకాశం బ్యారేజీకి ఇంత పెద్ద ఎత్తున నీరు రావడం ఇదే మొదటి సారి కావడంతో బ్యారేజీకి సందర్శకుల తాకిడి పెరిగింది. ఉప్పొంగుతున్న కృష్ణమ్మను తిలకించేందుకు జనం భారీగా తరలివస్తున్నారు.

వాయవ్య బంగాళాఖాతంలో అల్పపీడనానికి అనుబంధంగా 7.6 కి.మీ ఎత్తు వరకు ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. దీంతో ఇవాళ ఆదిలాబాద్, కుమురంభీం, మంచిర్యాల, పెద్దపల్లి, జయశంకర్‌ భూపాలపల్లి, వరంగల్, మహబూబాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, సూర్యాపేట, నల్లగొండ జిల్లాల్లో ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది. కోస్తా జిల్లాల్లో ఒక మోస్తరు నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. అల్పపీడన ప్రభావంతో సముద్రం అల్లకల్లోలంగా ఉన్నందున మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లకూడదని అధికారులు సూచించారు.