ఢిల్లీ చేరుకున్న పాక్ ఉగ్రవాది..రేపు కుట్రకు ప్లాన్..

intel-warns-of-possible-terror-strike-in-delhi-on-independence-day-says-jaish-e-mohammad-man-to-carry-out-fiyadeen-attack

స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను పాక్‌ ఉగ్రవాదులు టార్గెట్ చేశారు. జెండా పండగ రోజున దేశ రాజధానిలో ధ్వంసం రచనకు కుట్ర చేశారు. జైషే మహ్మద్‌ చీఫ్‌ మౌలానా మసూద్‌ అజార్‌ సోదరుడైన అస్గర్‌ దగ్గర బాడీగార్డ్‌గా పనిచేసిన మహ్మద్‌ ఇబ్రహీంకు… భారత్‌కు సంబంధించిన బాధ్యతలు అప్పగించినట్లు కేంద్ర నిఘా వర్గాలు గుర్తించాయి. ఇబ్రహీం ఇప్పటికే ఢిల్లీ చేరుకున్నట్లు భద్రతా దళాలకు సమాచారం అందించాయి. ఇబ్రహీంతో పాటు జైషే కేడర్‌ గురించి కూడా ఇంటెలిజెన్స్‌ వర్గాలు కీలక సమాచారం చేరవేశాయి.

మే తొలివారంలో జమ్మూ కశ్మీర్‌లో ప్రవేశించిన ఇబ్రహీం.. ప్రస్తుతం ఢిల్లీకి చేరుకున్నట్లు నిఘా వర్గాలు గుర్తించాయి. రాజధానిలోని జైషే శ్రేణులతో కలిసి విధ్వంస రచనకు పూనుకున్నాడని హెచ్చరించాయి. జైషే సీనియర్‌ మెంబర్‌ ఉమర్‌ సైతం… 72వ స్వాతంత్ర్య వేడుకల సందర్భంగా ఢిల్లీలో విధ్వంసం సృష్టించేందుకు అవసరమైన సదుపాయాలను సమకూర్చుతున్నట్టు నిఘా వర్గాలు భద్రతా దళాలకు సమాచారం అందించాయి. ఈ నేపథ్యంలో ఆగస్టు 17వ తేదీ వరకు ఢిల్లీతో పాటు అన్ని రాష్ట్రాలు అప్రమత్తంగా ఉండాలని కేంద్రం హోంశాఖ సూచించింది. అన్ని ఎయిర్‌పోర్టుల్లో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేయాలని ఆదేశించింది.

పాక్‌ నిఘా సంస్థ ఐఎస్‌ఐ సహకారంతో… టెర్రర్‌ ఆపరేషన్‌ను భారత వ్యతిరేక కార్యకలాపాల ఆపరేషనల్‌ కమాండర్‌ అస్గర్‌ పర్యవేక్షిస్తున్నాడు. మరోవైపు జమ్మూ కశ్మీర్‌లో అలజడి సృష్టించేందుకు భారత భూభాగంలోకి 600 మంది ఉగ్రవాదులను పంపేందుకు పాక్‌ సైన్యం సిద్ధంగా ఉందని నిఘా వర్గాలు హెచ్చరించడంతో.. సరిహద్దుల్లో భద్రతా దళాలు అలర్ట్‌ అయ్యాయి.