కాంగ్రెస్ పార్టీతోనే నా వివాహం జరిగిపోయింది

తెలంగాణలో అధికారం తమదే అన్నారు రాహుల్‌ గాంధీ.. ఇక ఏపీలోనూ పుంజుకుంటాంమంటూ ఆశాభావం వ్యక్తం చేశారు. హైదరాబాద్‌లో పర్యటిస్తున్న రాహుల్‌ గాంధీ.. రెండో రోజు వరుస భేటీలతో బిజీగా కనిపించారు. ఉదయాన్ని బూత్ అధ్యక్షులతో ఆయన టెలీకాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. ఈ సందర్భంగా తమ సమస్యల్ని జాతీయాధ్యక్షుడి దృష్టికి తెచ్చారు కొందరు నేతలు. రైతు రుణమాఫీపై కేసీఆర్ హామీ ఇచ్చినా ఏక కాలంలో మాఫీ కానందు వల్ల.. రైతులకు పెద్ద ప్రయోజనం కలగలేదన్నారు. డబుల్‌బెడ్ ఇళ్ల నిర్మాణం కూడా ఎక్కడా పూర్తి కాలేదన్నారు. దాదాపు 20 నిమిషాలపాటు ఇంటరాక్షన్ తర్వాత.. రాహుల్ క్యాడర్‌కు భరోసా ఇచ్చారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే అన్నీ చక్కబడతాయన్నారు.

తరువాత దాదాపు 40 మంది పార్టీ సీనియర్లతో ప్రత్యేకంగా సమావేశమైన రాహుల్‌, పొత్తులు, ఇతర రాజకీయ సమీకరణాలపైనా చర్చించారు. సీనియర్లంతా కలిసి పనిచేస్తే తెలంగాణలో కాంగ్రెస్‌కి పూర్వవైభవం వస్తుందన్నారు రాహుల్ గాంధీ. స్థానిక నేతల అభిప్రాయాలకు గౌరవం ఇస్తూ నిర్ణయాలు తీసుకుంటే.. మెరుగైన ఫలితాలు ఉంటాయన్నారు.

పార్టీ సీనియర్ల భేటీ తరువాత.. ఛానెళ్లు, పత్రికల ఎడిటర్స్‌తో సుదీర్ఘంగా రాహుల్‌ చర్చించారు. ఈ భేటీలో రాహుల్‌ తన పెళ్లిపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీతో తన వివాహం జరిగిపోయిందన్నారు. ఇక బీజేపీ హయాంలో మీడియాపై దాడులు పెరిగాయని, ఇది ఆందోళనకరమైన పరిణామమని రాహుల్‌ అన్నారు. తాను అన్ని మతాలను గౌరవిస్తానని చెప్పుకొచ్చారు. మోడీని కాదు.. ఆయన సిద్ధంతాలనే తాను వ్యతిరేకిస్తున్నాన్నారు. 2019 ఎన్నికల్లో మోడీ ప్రధాని కాలేరని రాహుల్‌ అభిప్రాయపడ్డారు. సొంతంగా 230 సీట్లు రాకపోతే మోడీ ప్రధాని అవ్వడం సాధ్యం కాదన్నారు..

వరుస భేటీలతో బిజీగా ఉన్న రాహుల్‌ గాంధీ పారిశ్రామిక వేత్తలతో సమావేశమయ్యారు. తాజ్‌ కృష్ణలో జరుగుతున్న ఈ సమావేశానికి యువ పారిశ్రామిక వేత్తలు భారీగా తరలివచ్చారు.. టీవీ 5 ఎండీ రవీంద్రనాథ్‌, నారా బ్రాహ్మిణి, దగ్గుబాటి సురేష్‌ బాబు, టీజీ భరత్‌, జేసీ పవన్‌తో సహా యువ పారిశ్రామిక వేత్తలు భారీగా హాజరయ్యారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే.. పారిశ్రామిక వేత్తలకు ఎలాంటి ప్రోత్సహకాలు ఉంటాయన్నదానిపై చర్చించే అవకాశం ఉంది. మరోవైపు వచ్చే ఎన్నికల్లో పారిశ్రామిక వేత్తలంతా కాంగ్రెస్‌కు సహాయంగా ఉండాలని రాహుల్‌ కోరే అవకాశం ఉంది..