ఏడాదికి ఒక్కసారే దుకాణం ఓపెన్.. మాల్పువోల కోసం క్యూ

రోజూ దుకాణం తెరిస్తేనే బేరం ఉంటుందో లేదో అని బాధ. మరి ఏడాదికి ఒక్కసారి తెరిస్తే ఎలా బతుకుతారు. ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఓం ప్రకాష్ పాలీవాలా గత 60 ఏళ్లుగా ఇదే పద్దతిని కొనసాగిస్తున్నారు. ఈ కుటుంబం నాలుగు తరాలుగా ఏడాదికి ఒక్కసారి మాత్రమే దుకాణం తెరిచి వేడి వేడి మాల్పువోలను అమ్ముతుంటారు.

హరియాలీ అమావాస్య రోజున మాత్రమే దుకాణం తెరిచి బేరం సాగిస్తుంటారు. వీరందించే రుచికరమైన మాల్పువోల కోసం ప్రతాప్‌గఢ్ వాసులు ఎదురు చూస్తుంటారు. మరెక్కడా ఇలాంటి రుచి రాదని దుకాణం తెరవగానే క్యూ కట్టేస్తుంటారు స్థానికులతో పాటు చుట్టుపక్కల గ్రామాల వారు సైతం. పర్యావరణానికి హాని కలగని విధంగా మాల్పువోలను పనస ఆకులలో కట్టి అమ్ముతుంటారు దుకాణదారులు.

మిగతా రోజుల్లో ఉపాధి కోసం తాళాలు విక్రయిస్తుంటారు. వీటిని కూడా సొంతంగా తయారు చేస్తుంటారు. బయట షాపుల్లో దొరికే తాళాల కన్నా తాము చేతితో తయారు చేసిన తాళాలు ఎంతో దృఢంగా ఉంటాయని దుకాణ యజమాని ఓం ప్రకాష్ తెలిపారు.