దేవుని ముందు దీపారాధన.. హృదయ నివేదన

దీపం.. చీకట్లను చీల్చి వెలుగుల్ని ప్రసాదిస్తుంది. దేవుని ముందు వెలిగించే దీపం తమలో ఉన్న అజ్ఞానాంధకారాన్ని తొలగించి జ్ఞానవెలుగుల్ని ప్రసాదించమని దేవదేవుడిని మనస్ఫూర్తిగా వేడుకుంటారు భక్తులు. ప్రమిదలో వత్తి వేసి వెలిగించనప్పుడు వచ్చే వెలుగు మనలోని జ్ఞానం. జ్ఞానమే ఆత్మ స్వరూపం. మనిషి నిరంతరం జ్ఞానాన్ని వికసింపచేసుకునే ప్రయత్నం చేయాలి. తనకున్న జ్ఞానాన్ని నలుగురి పంచాలి. అప్పుడే అది రెట్టింపవుతుంది.

ప్రమిదలో వేసిన వత్తి నూనె ఆధారంగా వెలుగుల్ని పంచుతుంది. చివరి చుక్క వరకు ప్రయత్నిస్తుంది. దేవుని దగ్గర దీపాలు రెండు ఉంచి దీపారాధన చేయాలి. కొందరు ఒకే దీపం పెడతారు. అటువంటప్పుడు ఒకే దీపంలో రెండు వత్తులు వేయాలి. మనస్సునే ప్రమిదగా చేసి, ప్రేమనే నెయ్యిని పోసి, భగవంతుని కొరకు చేసే ధ్యానమే వత్తులు, వెలుగు జ్ఞాన జ్యోతి అని భావించాలి.

మనసనే ఆకాశంలో కామం, క్రోదం, లోభం వంటి అంధకారాలు కమ్ముకున్నప్పుడు, ఆ పొరలను తొలగించుకోవడానికి మదిలో దీపం వెలిగించుకోవాలి. దీపం పరమాత్ముడి స్వరూపం. ప్రతి శుభకార్యానికి ముందు జ్యోతిని వెలిగించే మన భారతీయ సంప్రదాయంలో దీపానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. దైవ సన్నిధిలో నిరంతరం వెలిగే దీపాలను అఖండ జ్యోతులని అంటారు. ఇంట్లో నిత్య దీపారాధన చేయడం వలన ఆ ఇంటిలో శ్రీమహాలక్ష్మీ దేవి కొలువై ఉంటుంది. దీపానికి సృష్టి, స్థితి, లయ, మూడింటిలోనూ ప్రముఖ స్థానం ఉంది. దీప కాంతిని త్రిమూర్తులకు ప్రతీకగా చెబుతారు.