తిరుమల మహాసంప్రోక్షణలో నేడు అష్టబంధనం

today astabandhanam on tirumala mahasamprokshana

తిరుమల మహాసంప్రోక్షణలో భాగంగా ఇవాళ అష్టబంధనం జరగనుంది. మూలవిరాట్‌కు పన్నెండేళ్లకోసారి నిర్వహించే క్రతువులో భాగంగా.. వైదిక కార్యక్రమాల్నీ వేదపండితులు శాస్త్రోక్తంగా పూర్తి చేస్తున్నారు. నిన్న వైఖానస ఆగమంలో నిష్ణాతులైన ఆచార్యులంతా అష్టబంధన ద్రవ్యాలను తయారు చేశారు. శంఖచూర్ణం, మధుజ, లక్క, తెల్ల గుగ్గిలం, కార్పాసం, త్రిఫలం, రక్త శిలాచూర్ణం, మాహిష నవనీతాలను పూజాదికాల కోసం సిద్ధం చేశారు. ఇవాళ ఉదయం ఈ ద్రవ్యాలతో దేవతలను ఆరాధిస్తారు. శంఖచూర్ణంతో చంద్రుడిని, తేనెమైనంతో రోహిణి, లక్కతో అగ్ని, గుగ్గిలంతో చండ, ఎర్రపత్తితో వాయువు, త్రిఫల చూర్ణంతో హరిని, గైరికముతో స్కందుడు, వెన్నతో యముడిని ఆరాధిస్తారు. అనంతరం పెద్దరోటిలో అష్ట ద్రవ్యాలను దంచుతారు. ఇలా తయారైన పాకాన్ని ఒక పాత్రలోకి తీసుకుని ముద్దలుగా చేస్తారు. దాన్ని దారంలా పెనవేసి ప్రధాన అర్చకులు వేణుగోపాలదీక్షితులు సమక్షంలో శిల్పాచార్యులు మూలవిరాట్‌ విగ్రహం పాదపీఠం, పద్మపీఠం మధ్యలో బాగా మెత్తిస్తారు. ఇలా అష్టదిక్కుల్లో బంధనం చేస్తారు. ఉపాలయాల్లోని విగ్రహాలకూ సంధిబంధనం చేస్తారు. మహాసంప్రోక్షణలో భాగంగా రేపు నాలుగో రోజున తిరుమంజనం నిర్వహిస్తారు. ఐదో రోజు ఆనందనిలయంపై నుంచి పూర్ణాహుతి నిర్వహించేందుకు ప్రధాన అర్చకులు, రుత్వికులు అక్కడికి చేరుకుంటారు. దీనికోసం చెక్కలతో పటిష్ఠంగా నిచ్చెన ఏర్పాటు చేశారు.