శ్రీకాకుళంలో రాష్ట్రస్థాయి పంద్రాగస్టు వేడుకలు

72-independence-day-celebrations-in-srikakulam

ఆంధ్రప్రదేశ్‌లో పంద్రాగస్టు వేడుకల కోసం శ్రీకాకుళం ముస్తాబైంది. జిల్లాలో తొలిసారిగా జరగనున్న రాష్ట్ర స్థాయి వేడుకులకు ఘనంగా ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఏటా ఒక్కో జిల్లాలో స్వాతంత్య్ర దినోత్సవాలు నిర్వహించాలని సీఎం చంద్రబాబు సంకల్పించిన నేపథ్యంలో పట్టణం వెలిగిపోతోంది. రాజధాని అమరావతి నుంచి జీఏడీ అధికారులు పట్టణానికి తరలివచ్చి ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఇక పోలీసులు పకడ్బందీగా ఏర్పాట్లు చేస్తున్నారు.

ప్రధాన వేడుకలు జరిగే ఆర్ట్స్ కళాశాల మైదానంలో ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ కె.ధనంజయరెడ్డి నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. పరేడ్ గ్రౌండ్, స్టేజ్, హైటీ, తదితర ప్రదేశాల వద్ద జరుగుతున్న పనులను పరిశీలించారు. వర్షం కురిస్తే ఇబ్బంది తలెత్తకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.

స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు పురస్కరించుకొను శ్రీకాకుళం పట్టణంలో అభివృద్ధి పనులు ఊపందుకున్నాయి. పట్టణానికి నూతన శోభ వచ్చింది. రహదారి ఆక్రమణలు తొలగిపోయాయి. రోడ్లపై పశువుల సంచారం తగ్గింది. ఎక్కడికక్కడ చెక్‌పోస్టుల ఏర్పాటుతో ట్రాఫిక్ ఒక పద్ధతి ప్రకారం సాగుతోంది. ఇక రహదారులను వెడల్పు చేసి.. కొత్త రోడ్లు వేశారు. పట్టణంలోని లాడ్జీలు, హోటళ్లపై ప్రత్యేక నిఘా పెట్టారు. పట్టణంలోకి కొత్త వ్యక్తులు ఎవరైనా వస్తున్నారా అనే అంశంపై యంత్రాంగం దృష్టి సారించింది.