దేశవ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలు

నైరుతి రుతుపవనాలకు తోడు బంగాళాఖాతం, అరేబియా సముద్రంలో ఏర్పడిన అల్పపీడనాల ప్రభావంతో… దేశవ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. కేరళను పదిహేను రోజులుగా కుండపోత వర్షాలు వీడడం లేదు. సగానికి పైగా రాష్ట్రం వరద గుప్పిట్లో చిక్కుకుని ఉంది. పాలక్కాడ్‌, ఎర్నాకులం, కొచ్చి, ఇడుక్కి జిల్లాలో వరద బీభత్సం నెలకొంది. ఊళ్లకు ఊళ్లే నీట మునుగుతున్నాయి. వేలాదిగా ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాలు ఎటూ సరిపోవడం లేదు.

Image result for heavy rains

డిజాస్టర్‌ మేనేజ్‌మెంట్‌ సిబ్బంది తీవ్రంగా శ్రమించి… మారుమూల ప్రాంతాల్లో చిక్కుకున్న వారిని సురక్షిత ప్రాంతాలకు తీసుకొస్తున్నారు. అటు నదులన్నీ ప్రమాదకర స్థాయిని మించి ప్రవహిస్తుండడంతో… ప్రాజెక్టుల గేట్లు ఎత్తే ఉంచారు. ఇడుక్కి ప్రాజెక్టు గేట్లు పూర్తి స్థాయిలో ఎత్తేయడంతో… కొచ్చి విమానాశ్రయం నీట మునిగింది.

Image result for heavy rains

ఇక్కడ శనివారం వరకు రాకపోకలు సాధ్యం కాదని అధికారులు తేల్చేశారు. అటు శబరిమల దేవస్థానం దగ్గరున్న పంబానది కూడా ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తోంది. వరదల్లో చిక్కి ఇప్పటివరకు దాదాపు 40 మంది ప్రాణాలు కోల్పోయినట్లు అధికార వర్గాలు చెబుతున్నాయి…

Image result for heavy rains

ఇక అటు కేరళ వరదల ప్రభావం క్రమంగా పొరుగున ఉన్న కర్ణాటకపైనా పడుతోంది. సరిహద్దు జిల్లాలైన కొడగు, శివమొగ్గ, ఉడిపి, మైసూరు, చిక్కమగళూరు, దక్షిణ కన్నడ జిల్లాలో వరద బీభత్స కొనసాగుతోంది. పల్లెలు, పట్టణాలు అన్న తేడా లేకుండా అన్ని ప్రాంతాలు నీట మునిగాయి. ఈదురు గాలులకు పోక, అరటి, కాఫీ తోటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. అనేక ప్రాంతాల్లో కొండచరియలు విరిగిపడడంతో… మారుమూల ప్రాంతాలకు రాకపోకలు నిలిచిపోయాయి. రానున్న రోజుల్లో వర్షపాతం మరింత పెరిగే అవకాశం ఉందన్న సూచనలు రాష్ట్ర సర్కారుకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. వరదల ప్రభావం తీవ్రంగా ఉన్న ప్రాంతాల్లో పాఠశాలలకు సెలవులు ప్రకటించారు…

Image result for heavy rains

ఇక అటు శరావతి నది పొంగి పొర్లుతుండడంతో… సుప్రసిద్ధ జోగ్‌ జలపాతం పరవళ్లు తొక్కుతోంది. దేశంలోనే అతి ఎత్తైన ఈ వాటర్‌ఫాల్‌లోని నాలుగు ధారలు నిండుగా ప్రవహిస్తుండడంతో… ఆ దృశ్యం కనువిందు చేస్తోంది….

ఇక అటు ఉత్తరాది సైతం భారీ వర్షాలకు అతలాకుతలం అవుతోంది. ముఖ్యంగా హిమాచల్‌ ప్రదేశ్‌, ఉత్తరాఖండ్‌ లో కొండ ప్రాంతాల్లో పరిస్థితి భయానకంగా ఉంది. పెద్ద మొత్తంలో కొండచరియలు విరిగి పడుతుండడంతో… రాకపోకలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి

- ఉచితంగా మీ జాతకాన్ని తెలుసుకోండి -