72వ స్వాతంత్య్ర దినోత్సవాలకు ముస్తాబైన గోల్కొండ కోట

telangana-state-72-independence-day-celebrations-in-golkonda-kota

72వ స్వాతంత్య్ర దినోత్సవాలకు చారిత్రక గోల్కొండ కోట ముస్తాబైంది. విద్యుత్‌దీప కాంతులతో వారసత్వ సంపద ధగధగలాడుతోంది. పంద్రాగస్టు వేడుకల సందర్భంగా కోటలో తెలంగాణ ప్రభుత్వం భారీ ఏర్పాట్లు చేసింది. రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి పంద్రాగష్టు వేడుకలను గోల్కొండలోనే నిర్వహిస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్‌.. ఈ సారి కూడా ఇక్కడే పతాకావిష్కరణ చేయనున్నారు..

పంద్రాగస్టు వేడుకల నేపథ్యంలో గోల్కొండ కోటను నిఘా నీడలోకి తీసుకున్నారు. కోటలో పెద్ద సంఖ్యలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి అణువణువు పరిశీలిస్తున్నారు. బషీర్ బాగ్‌లోని కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి వీటిని మానిటరింగ్ చేస్తున్నారు. అటు గ్రెహౌండ్స్ బలగాలు కోటను తమ ఆధీనంలోకి తీసుకుని అణువణువు క్షుణ్ణంగా తనిఖీ చేశాయి. వేడుకలకు హాజరయ్యే వీఐపీలు, సందర్శకులు, స్కూల్ విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు చర్యలు తీసుకున్నారు. వేడుకలను ఎల్ఈడీ స్క్రీన్ల ద్వారా చూసే వీక్షించే ఏర్పాట్లు చేశారు..

వేడుకలను వీక్షించేందుకు వచ్చే సందర్శకులపై పోలీసులు ఆంక్షలు విధించారు. హ్యాండ్ బ్యాగ్స్, టిఫిన్ బాక్సులు, వాటర్ బాటిళ్లను తీసుకురావద్దని సూచించారు. వేడుక రోజు కోటకు వచ్చే వీవీఐపీ, వీఐపీ, సాధారణ ప్రజల వాహనాల పార్కింగ్‌కి సంబంధించి పోలీస్ యంత్రాంగం ఇప్పటికే ఓ మ్యాప్ కూడా విడుదల చేసింది. మ్యాప్‌లో ఇచ్చిన సూచనల మేరకే సందర్శకులు తమ వాహనాలను పార్కింగ్ చేసి.. తమకు సహకరించాలని పోలీసులు కోరారు. ఉదయం 10 గంటలకు గోల్కొండ కోట ప‌రిస‌ర ప్రాంతాల్లో ట్రాఫిక్‌ నిబంధనలు విధించారు. ఉదయం 7 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు రామ్‌దేవ్‌గూడ నుంచి గోల్కొండ కోటకు వెళ్లే దారిని పూర్తిగా మూసివేస్తారు.