మరోసారి రక్తమోడిన ఆప్గనిస్థాన్

afghanistan-huge-explosion-hits-kabul-city

ఆప్గానిస్థాన్ రాజధాని మరోసారి రక్తమోడింది. ఇటీవల క్రితం షియా వర్గం ప్రజలే లక్ష్యంగా కాబూల్‌లో జరిగిన దాడి మరవక ముందే మరో ఘటన చోటు చేసుకుంది. షియా వర్గీయులే లక్ష్యంగా జరిగిన ఆత్మాహుతి దాడిలో మృతుల సంఖ్య 48కి పెరిగింది. తీవ్రంగా గాయపడిన 65మందిలో.. పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు కాబూల్ అధికారిక వర్గాలు ప్రకటించాయి. పశ్చిమ కాబూల్‌ సమీపంలోని ఓ ట్యూషన్ సెంటర్‌లో ఆత్మాహుతి దాడికి పాల్పడ్డారు. ట్యూషన్ సెంటర్ సమీపంలోకి బాంబుతో వచ్చిన వ్యక్తి.. తనను తాను పేల్చుకొని ఈ దాడికి పాల్పడ్డాడని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ఈ దాడి తాలిబనల్ల పనేనని అక్కడి పోలీసులు భావిస్తుండగా.. తాము దాడికి పాల్పడలేదని తాలిబన్లు ప్రకటించడం చర్చనీయాంశమైంది.

ఇటీవలే అఫ్గానిస్థాన్‌లోని గజనీ నగరంలో తాలిబన్‌లు, ఆఫ్గాన్‌ సైనికులకు మధ్య జరిగిన కాల్పుల్లో పదుల సంఖ్యలో సైనికులు ప్రాణాలు కోల్పోయారు. ఈ పోరులో తాలిబన్‌ ఉగ్రవాదులు కూడా హతమయ్యారు. ఆ దాడి మరవక ముందే కాబూల్‌లో మరో దాడి జరగడం సంచలనం రేపుతోంది. వరుస దాడులతో ఆఫ్గనిస్థాన్ అధ్యక్షుడు అష్రాఫ్‌ ఘనీ ప్రభుత్వంపై ఒత్తిడి పెరిగిపోతోంది. ఈ ఏడాది అక్టోబరు 20న ఆ దేశ పార్లమెంటరీ ఎన్నికలు జరగనున్నాయి. ఇటీవల తాలిబన్లకు, ఆ దేశ సైనికులకు మధ్య జరిగిన కాల్పుల కారణంగా శాంతి చర్చలకు అవకాశం లేకుండా పోయింది. దీంతో కాబూల్‌తో పాటు అఫ్గానిస్థాన్‌లోని ఇతర నగరాల్లో ప్రజలు ఏ సమయంలో దాడులు జరుగుతాయోనని భయం గుప్పిట బతుకుతున్నారు.