ఆందోళనకరంగా మాజీ ప్రధాని వాజ్‌పేయి ఆరోగ్యం..

atal-bihari-vajpayee-critical-put-on-life-support-system-aiims

మాజీ ప్రధాని వాజ్‌పేయి ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా మారింది. 93 ఏళ్ల వాజ్‌పేయి ఢిల్లీలోని ఎయిమ్స్‌ ఆస్పత్రిలో తొమ్మిది వారాలుగా మృత్యువుతో పోరాడుతున్నారు. మంగళవారం నుంచి ఆయన ఆరోగ్య పరిస్థితి దిగజారడంతో వెంటిలేటర్‌పై చికిత్స అందిస్తున్నారు. ఆస్పత్రిలో వాజ్‌పేయిని ప్రధాని మోడీ పరామర్శించగా.. ఇవాళ దేశవ్యాప్తంగా బీజేపీ కార్యక్రమాలను రద్దు చేసుకుంది.

ప్రస్తుతం ఆయనకు వెంటిలేటర్‌పై చికిత్స అందిస్తున్నట్లు తెలిపారు. మూత్రనాళాల ఇన్ఫెక్షన్‌తో బాధపడుతున్న వాజ్‌పేయిని.. ఆయన కుటుంబ సభ్యులు జూన్‌ 11న ఆసుపత్రిలో చేర్పించారు. ప్రస్తుతం వాజ్‌పేయి కిడ్నీ ఒక్కటే పనిచేస్తోంది. దానికి కూడా ఇన్ఫెక్షన్ సోకడంతో.. పరిస్థితి మరింత విషమించింది.

వాజ్‌పేయి ఆరోగ్యం విషమంగా ఉందని తెలియడంతో.. బుధవారం సాయంత్రం ప్రధాని నరేంద్ర మోడీ హుటాహుటిన ఎయిమ్స్‌కు చేరుకున్నారు. వాజ్‌పేయి ఆరోగ్య పరిస్థితిని, ఆయనకు అందిస్తున్న వైద్యం గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. అంతకుముందు బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా వాజ్‌పేయిని పరామర్శించారు. అలాగే కేంద్రమంత్రులు, బీజేపీ నేతలు సైతం ఎయిమ్స్ ఆస్పత్రికి క్యూ కట్టారు. వాజ్‌పేయి ఆరోగ్య పరిస్థితిపై ఎయిమ్స్‌లో గంటన్నరపాటు కేంద్ర రైల్వేమంత్రి పీయూష్‌ గోయల్‌ చర్చించారు. కేంద్రమంత్రులు సురేశ్‌ ప్రభు, జితేంద్ర సింగ్‌, అశ్వినికుమార్‌ చౌబేలు వెళ్లి ఆరోగ్య పరిస్థితిపై అడిగి తెలుసుకున్నారు. మాజీ ప్రధానికి చికిత్స అందిస్తున్న వార్డు దగ్గర ఇప్పటికే భారీగా పోలీసు బలగాలను మోహరించారు.