ఆనందంగా స్కూల్‌ నించి వచ్చింది.. అంతలోనే మృత్యువు పాము రూపంలో

అమ్మా.. మా స్కూల్లో జరిగిన ఖోఖో ఆటల పోటీలో నేను గెలిచాను.. ఇదిగో బహుమతి అంటూ ఆనందంగా అమ్మకి చూపించింది. అంతలోనే మృత్యువు పాము రూపంలో వచ్చి ఆనందాన్ని ఆవిరి చేసింది. శ్రీకాకుళం జిల్లా సంత బొమ్మాళి మండలానికి చెందిన అప్పన్న, అమ్మలుకు ఇద్దరు కుమార్తెలు. భర్త మరణించడంతో ఇద్దరు బిడ్డల్ని తనే కష్టపడి చదివిస్తోంది అమ్మలు. పెద్ద కూతురు డిగ్రీ చదువుతోంది. చిన్న కూతురు దీపిక ఏడవ తరగతి చదువుతోంది. బుధవారం స్కూల్లో జరిగిన స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో పాల్గొంది.

ఈ సందర్భంగా ఆటల్లో గెలిచిన వారికి బహుమతులు అందజేశారు. దీపిక ఖోఖో ఆటకిగాను బహుమతి గెలుచుకుంది. ఇంటికి వచ్చి వంట గదిలో ఉన్న అమ్మకి, బావి దగ్గర బట్టలు ఉతుకుతున్నఅక్కకి తనకి వచ్చిన బహుమతిని చూపించింది. తిరిగి ఇంట్లోకి వెళుతున్న సమయంలో ఎక్కడినుంచో పాము వచ్చి దీపికను కాటు వేసింది. భయంతో అరిచిన దీపిక పరుగున వెళ్లి అమ్మకి చెప్పింది. వెంటనే తల్లి గ్రామస్థుల సాయంతో ఆసుపత్రికి తీసుకువెళ్లింది. బాలికను పరీక్షించిన వైద్యులు దీపిక అప్పటికే మృతిచెందినట్లు నిర్థారించారు. అప్పటిదాకా ఆడుతూ పాడుతున్న బిడ్డ అంతలోనే మృత్యువు ఒడికి చేరడం ఆ తల్లిని కలచివేస్తుంది. జీవచ్చవంలా పడిఉన్న బిడ్డని చూసి కన్నీరు మున్నీరుగా రోదిస్తోంది.