ఇప్పట్లో కోలుకునేలా లేదు.. కేరళలో మళ్ళీ భారీవర్షాలు

భారీవర్షాల ప్రభావం నుంచి కేరళ ఇప్పట్లో కోలుకునేలా కనిపించడం లేదు. అతిభారీవర్షాలు ఇవాళ కూడా కొనసాగవచ్చని వాతావరణ శాఖ హెచ్చరిస్తున్న నేపథ్యంలో.. జనం బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. 14 జిల్లాల్లో హైఎలర్ట్ ప్రకటించారు. ఇడుక్కి, కోజికోడ్, కన్నూర్, వాయ్‌నాడ్, మలప్పురం జిల్లాల్లో వేల మంది పునరావాస శిబిరాల్లో ఆశ్రయం పొందుతున్నారు. పలుచోట్ల కొండ చరియలు విరిగిపడుతుండడంతో ఏ క్షణాన ఎటు నుంచి ముప్పు ముంచుకు వస్తుందోనన్న ఆందోళన కనిపిస్తోంది. నిన్న ఒక్కరోజే 25 మంది వర్షాల కారణంగా మరణించడంతో విషాదం నెలకొంది. ఇప్పటివరకూ ఈ విలయానికి బలైనవారి సంఖ్య 72కి చేరింది.

కేరళలో ఆగస్టు 8న వర్షాలు మొదలయ్యాయి. ఇప్పటికీ అక్కడ సాధరణ నెలకొనే పరిస్థితి లేకపోవడంతో జనం విలవిల్లాడిపోతున్నారు. వారం రోజులుగా సరైన తిండీతిప్పలు లేక అల్లాడుతున్నారు. ఊళ్లు చెరువులవ్వడంతో బోట్లలో తిరగాల్సిన పరిస్థితులు వచ్చాయి. చాలా గ్రామాలు, పట్టణాల్లో మొల లోతు నీళ్లు నిలిచిపోవడంతో కరెంటు లేక, తినడానికి తిండి లేక ఇబ్బంది పడుతున్నారు. కొన్నిచోట్ల శుభ్రమైన తాగునీరు కూడా దొరక్క పిల్లలతో ఉన్న వాళ్లు కష్టాలు పడుతున్నారు.

కొచ్చి ఎయిర్‌పోర్టులోకి భారీగా వరద నీరు చేరడంతో మరో రెండురోజులు దీన్ని మూసే ఉంచనున్నారు. వాతావరణం అనుకూలించి, రన్‌వేపై నిలిచిన నీరును తీసేయగలిగితే.. శనివారం విమాన సర్వీసులు తిరిగి ప్రారంభం అవుతాయి. వర్షాల కారణంగా కొచ్చి మెట్రో రైల్ సర్వీసులు ఇవాళ కూడా నిలిచిపోనున్నాయి. అటు, ఇడుక్కి రిజర్వాయర్ నుంచి వరద ఉధృతి ఇంకా కొనసాగుతుంది. ముళ్లాపెరియార్ డ్యామ్ గేట్లను కూడా ఎత్తి భారీగా నీటిని కిందికి వదులుతున్నారు. కేరళలో పర్యాటకుల్ని విపరీతంగా ఆకర్షించే అతిరిపల్లి వాటర్ ఫాల్స్ గతంలో ఎన్నడూ లేనంత ఉధృతితో ప్రవహిస్తోంది. అటు, వర్షాల కారణంగా చాలా రైల్ సర్వీసులు కూడా రద్దయ్యాయి.

కనీవినీఎరుగని వరద విలయం ముంచెత్తడంతో కేరళ ప్రభుత్వం ఓనం వేడుకల్ని నిలిపివేసింది. ఇందుకోసం కేటాయించిన 30 కోట్ల రూపాయల నిధుల్ని సహాయ చర్యలకు వినియోగించాలని సీఎం విజయన్ ఆదేశించారు. ప్రాథమిక అంచనా ప్రకారం కేరళలో 10 వేల కిలోమీటర్ల రోడ్లు దెబ్బతిన్నాయి. వేలాది ఇళ్లు కూలిపోయాయి. అన్ని జిల్లాల్లో ప్రస్తుతం 80 వేల మంది పునరావాస శిబిరాల్లో ఉన్నారు. ఒక్క ఎర్నాకుళంలోనే 30 వేల మంది వరద బాధితులు సహా య శిబిరాల్లో బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. ఇడుక్కి, కొట్టాయం, అలెప్పి, కొల్లం, మలప్పురం, కోజికోడ్‌, వాయ్‌నాడ్‌లోనూ పెద్ద సంఖ్యలో బాధితులు సాయం కోసం ఎదురు చూస్తున్నారు. ప్రధాని మోడీ కూడా కేరళ ముఖ్యమంత్రితో మాట్లాడి సహాయ చర్యల వివరాల్ని తెలుసుకున్నారు. రాష్ట్రానికి అదనపు NDRF బలగాల్ని పంపాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని కోరింది.

మరోవైపు కేరళ చరిత్రలోనే తొలిసారిగా 35 డ్యామ్‌లు ఎత్తేశారు. పురాతన ముళ్లపెరియార్‌ డ్యామ్‌కు వరదనీరు భారీగా వచ్చిచేరడంతో పూర్తిగా నిండిపోయి.. ప్రమాదస్థాయికి చేరుకుంది. ముళ్లపెరియార్‌ డ్యామ్‌ ఎత్తు 142 అడుగుల్ని వరద నిన్ననే దాటేయడంతో.. ప్రాజెక్టు గేట్లు ఎత్తి భారీగా వరద నీటిని దిగువకు వదిలేస్తున్నారు. వందేళ్లకుపైగా చరిత్ర కలిగిన ఈ డ్యామ్‌ భద్రతపై తమిళనాడు, కేరళ మధ్య వివాదం కొన్నేళ్లుగా నడుస్తోంది. ప్రస్తుతం భారీగా వరద వస్తుండటంతో డ్యామ్‌ సామర్థ్యాన్ని మించి నీటిమట్టం పెరిగితే.. ఇది ప్రమాదానికి దారితీసే అవకాశం ఉన్నందున.. ప్రాజెక్టు గేట్లు ఎత్తేశారు.

- ఉచితంగా మీ జాతకాన్ని తెలుసుకోండి -