సార్వత్రిక ఎన్నికలతో పాటు… 11 రాష్ట్రాలకు ఎన్నికలు?

jamili-election-updates

సార్వత్రిక ఎన్నికలతో పాటు… 11 రాష్ట్రాలకు ఎన్నికలు నిర్వహించాలని కేంద్రప్రభుత్వం భావిస్తున్నట్టు తెలుస్తోంది. రాజ్యాంగ సవరణ చేయకుండానే ఎన్నికల నిర్వహణకు గల అవకాశాలను పరిశీలిస్తోంది. ఇందులో భాగంగానే బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా లా కమిషన్ కు లేఖ రాశారని ఢిల్లీ వర్గాల ప్రచారం. ఇందుకోసం కొన్ని రాష్ట్రాల ఎన్నికలు ఆలస్యంగా.. మరికొన్ని రాష్ట్రాలకు ముందుగా ఎన్నికలు నిర్వహించవచ్చని తెలుస్తోంది. అయితే ఇందుకు ఆయా రాష్ట్రాలు అంగీకరించాల్సి ఉంటుంది. లేని పక్షంలో ఖచ్చితంగా చట్ట సవరణ చేయాలి.

బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా లేఖ నేపథ్యంలో మరోసారి జమిలి అంశంపై చర్చ మొదలైంది. సార్వత్రిక ఎన్నికల తర్వాత ఏడాదిన్నర తర్వాత మహారాష్ట్ర, హరియాణ, జార్ఖండ్ రాష్ట్రాలకు కూడా 2019లో ఎన్నికలు జరపాల్సి ఉంటుంది. ఇక బీహార్ కు కూడా 2020లో ఎన్నికలు జరగాల్సి ఉంది. నితీశ్ కూడా బీజేపీ ఆలోచనలకు మద్దతు ఇస్తే.. బీహార్ ను కూడా ఈ జాబితాలో కలిపే అవకాశం ఉంది. ఇక ఈ ఏడాది చివరిలోగా ఎన్నికలు జరగాల్సిన మధ్య ప్రదేశ్, ఛత్తీస్ ఘడ్, రాజస్తాన్ లతో పాటు.. 2019 మేలో జరిగే ఏపీ, తెలంగాణ, మిజోరాం, ఒడిషా రాష్ట్రాలకు ఎన్నికలు నిర్వహించవచ్చన్నది బీజేపీ ఆలోచన. ఒకవేళ ఆయా రాష్ట్రాలన్నీ అంగీకరిస్తే.. రాజ్యాంగ సవరణ అవసరం లేకుండానే… పార్లమెంట్ తో పాటు… 11 రాష్ట్రాలకు ఎన్నికలు వస్తాయి.

పార్లమెంట్ తో పాటు.. 11 రాష్ట్రాలకు ఎన్నికలు జరిగితే తమకు అనుకూలంగా మారుతుందని బీజేపీ భావిస్తోంది. మధ్యప్రదేశ్, ఛత్తీస్ ఘడ్, రాజస్తాన్ లలో ఉన్న ప్రభుత్వ వ్యతిరేకత నుంచి బయటపడే అవకాశం ఉందని కమలనాధుల ఆలోచన. జార్ఖండ్, హరియాణా, మహారాష్ట్రలలో తమ ప్రభుత్వమే ఉంది కాబట్టి.. ఎలాంటి అభ్యంతరం లేదు. బీహార్ లో జమిలీకి మిత్రుడు నితీశ్ దాదాపు ఓకే అంటున్నారు. మధ్యప్రదేశ్, చత్తీస్ ఘడ్, రాజస్తాన్ ఎన్నికలు ఆలస్యంగా జరపాల్సి ఉంటుంది. ఆరు నెలలే కాబట్టి ఇది తమ పరిధిలో నిర్ణయం కాబట్టి సమస్య లేదు. ఇక ఒడిషా, తెలంగాణ, ఏపీలో మాత్రం ఆయా పార్టీలు ఎలా స్పందిస్తాయన్నది చూడాలి. ఏపీ, ఒడిషా, తెలంగాణలో షెడ్యూల్ ప్రకారమే కాబట్టి ఇబ్బంది లేదన్నది అమిత్ షా ఆలోచన. మరి కమలనాథుల ఎత్తులు పారతాయా? ఆయా రాష్ట్రాల్లో తమపై వ్యతిరేకత నుంచి బయటపడటానికి జమిలికి సిద్దపడతారా? చూడాలి.