నేడు పూర్ణాహుతితో మహా సంప్రోక్షణ పరిసమాప్తం

maha-samprokshana-latest-updates

పన్నెండేళ్లకోసారి నిర్వహించే మహా క్రతువు తిరుమలలో శాస్త్రోక్తంగా జరుగుతోంది. వేద పండితులు, రుత్వికులు అత్యంత నియమ నిష్టలతో మహా సంప్రోక్షణ చేపడుతున్నారు. నాలుగో రోజున చతుర్దశ కలశ స్నపన తిరుమంజనం, మహాశాంతి తిరుమంజనం కార్యక్రమాలను ఆగమ శాస్త్రబద్ధంగా నిర్వహించారు. నేడు పూర్ణాహుతితో మహా సంప్రోక్షణ పరిసమాప్తం కానుంది.

తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామివారి ఆలయంలో అష్టబంధన బాలాలయ మహాసంప్రోక్షణ ఆఖరి ఘట్టానికి చేరుకుంది. సంప్రోక్షణలో భాగంగా నాలుగు రోజులుగా వైదిక కార్యక్రమాలు శాస్త్రోక్తంగా కొనసాగుతున్నాయి. బుధవారం ఉదయం శ్రీవారి మూలవర్లకు, పరివార దేవతలకు చతుర్దశ కలశ స్నపన తిరుమంజనం నిర్వహించారు. మధ్యాహ్నం 3 నుంచి రాత్రి 7 గంటల వరకు మహాశాంతి పూర్ణాహుతి… తరువాత శ్రీవారి మూలవర్లకు, పరివార దేవతలకు మహాశాంతి తిరుమంజనం చేపట్టారు. రాత్రి యాగశాల కార్యక్రమాలు నిర్వహించారు. 12 ఏళ్లకోసారి శ్రీవారికి ప్రత్యేకంగా నిర్వహించే అభిషేకాన్ని… ఆగమ శాస్త్రోక్తంగా జరిపించారు.

maha samprokshana

నేటితో శ్రీవారి ఆలయంలో మహా సంప్రోక్షణం పరిసమాప్తం కానుంది. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు చివరి ఘట్టమైన పూర్ణాహుతి కొనసాగుతుంది. సాయంత్రం గరుడ, పెద్దశేష వాహన సేవలు నిర్వహిస్తారు. రాత్రి యాగశాలలో హోమాలు జరిపించి.. అర్చకులు, రుత్వికులకు బహుమానాలు అందజేయడంతో మహా సంప్రోక్షణ పరిసమాప్తమవుతుంది. శుక్రవారం ఉదయం నుంచి యధావిధిగా మూలవర్లు, ఉత్సవ మూర్తులకు నివేదనలు, కైంకర్యాలు జరుగుతాయి. ఆర్జిత సేవలు, అన్ని మార్గాల్లో దర్శనాలను పునరుద్ధరిస్తారు.

మహాసంప్రోక్షణతో శ్రీవారి ఆలయం స్వర్ణ కాంతులతో దేదీప్యమానంగా వెలుగుతోంది. గర్భాలయం, ఉప ఆలయాల మరమ్మతులు, గోపురాలు, స్వర్ణ పీఠాలు, శిఖరాల సుందరీకరణ పనులు పూర్తి చేశారు. ధ్వజస్తంభం శిఖరానికి మరమ్మతులు చేపట్టి లక్షన్నర విలువైన 11 నూతన బంగారు రావి ఆకులను అమర్చారు. అలాగే ధ్వజస్తంభానికి పీఠానికి మధ్య పట్టుకోసం తొడగడానికి 4 లక్షలు వెచ్చించి తయారు చేసిన బంగారు చట్రాన్ని అర్చకులు అమర్చారు. ఆనంద నిలయంపై వెలసిన విమాన వేంకటేశ్వరస్వామి వారికి లక్షా 75 వేలతో తయారు చేసిన వెండి మకర తోరణాన్ని అలంకరించారు.