అప్పుడే పుట్టిన చిన్నారిని కాలువలో పడేశారు..

newborn baby was thrown into the canal in chennai

అప్పుడే పుట్టిన పసికందును మురికి కాలువలో పడేశారు గుర్తుతెలియని వ్యక్తులు. దీంతో గుక్కపట్టి ఏడవడం చూసి తట్టుకోలేక పోయిన మహిళ పసికందును తీసుకుని సపర్యలు చేసింది. చెన్నై వలసరవక్కం ప్రాంతంలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన ఫోటోలు సామాజిక మాధ్యమాల్లో షేర్ అవుతున్నాయి. వలసరవక్కం ప్రాంతంలో నివసించే గీత బుధవారం ఇంటిముందు పని చేసుకుంటున్నారు. పాలు పోయడంకోసమని ఓ వ్యక్తి ఆ ప్రాంతానికి వచ్చాడు. అయితే అతనికి ఎక్కడినుంచో ఏడుపు శబ్దం వినిపిస్తుందంటూ గీతతో అన్నాడు. ఈ క్రమంలో ఇద్దరూ కలిసి వెతకసాగారు. ఆ పరిసర ప్రాంతాల్లోని మురికి కాలువలో చిన్నారి బాబు కొట్టుకురావడం చూసి హతాశులయ్యారు. వెంటనే ఆ చిన్నారిని గీత తన చేతుల్లోకి తీసుకుని ఒంటిపై ఉన్న మురికిని అంతా శుభ్రం చేసి.. అనంతరం ఆసుపత్రిలో చేర్పించింది. ప్రస్తుతం చిన్నారికి ఎటువంటి ప్రమాదం లేదని వైద్యులు చెప్పారు. చికిత్స అనంతరం చిన్నారి బాబును ప్రభుత్వ బాలల సంరక్షణ గృహానికి తరలించనున్నారు. స్వాతంత్ర్య దినోత్సవం రోజున.. బాబు తాను జీవించే స్వేచ్ఛను పొందాడని.. తద్వారా ఆ బాబుకు ‘సుతంతిరం'(స్వతంత్రం) అనే పేరు పెట్టినట్లు గీత వెల్లడించారు.