తెలుగు రాష్ట్రాల్లో మోస్తరు నుంచి భారీవర్షాలు

heavy rain in two telugu states

తెలుగు రాష్ట్రాల్లో వర్షాల జోరు కొనసాగుతోంది. వాయుగుండం ప్రభావంతో పలు ప్రాంతాల్లో కుండపోత కురుస్తోంది. ప్రాజెక్టులు జలకళను సంతరించుకున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా తెలంగాణతో పాటు ఏపీలో మోస్తరు నుంచి భారీవర్షాలు కురుస్తున్నాయి. ఎగువన కురుస్తున్న వర్షాలతో.. ప్రాజెక్టులకు వరద ఉధృతి పెరిగింది.

ఇక, రెండు రాష్ట్రాల్లోనూ ప్రాజెక్టులు నిండుకుండల్లా దర్శనమిస్తున్నాయి. శ్రీశైలం జలాశయానికి ఇన్‌ఫ్లో అంతకంతకూ పెరుగుతోంది. ఇన్ ఫ్లో 3 లక్షల 11వేల 212 క్యూసెక్కులు కాగా, అవుట్ ఫ్లో లక్షా 827గా కొనసాగుతోంది. ప్రస్తుతం ప్రాజెక్టులో 172 టీఎంసీల నీరు నిల్వ ఉంది.

ఆల్మట్టి, నారాయణపూర్‌, జూరాల జలాశయాలు పూర్తిగా నిండిపోయాయి. ఇప్పటికే జలవిద్యుత్‌ కేంద్రాల్లో ఉత్పత్తి కొనసాగుతోంది. ప్రాజెక్టుల్లోకి ఈ వరద ఉదృతి మరింత కొనసాగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహిస్తున్నారు.

కర్నూల్‌ను వరద భయం వణికిస్తోంది. తుంగభద్ర డ్యామ్‌ 33 గేట్లు ఎత్తివేయడంతో రెండు లక్షల క్యూసెక్కుల ఉధృతితో తుంగభద్ర నది ఉగ్రరూపం దాల్చింది. నదీ తీరం లోతట్టు ప్రాంత వాసులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.

పశ్చిమగోదావరి జిల్లా కొత్తూరు కాజ్ వేపై నాలుగు అడుగుల మేర వరదనీరు చేరింది. 19 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. గోదావరికి మరింత ఉధృతి పెరిగే అవకాశం ఉండడంతో అధికారవర్గాలు అప్రమత్తమయ్యాయి.

మరోవైపు, భద్రాచలం దగ్గర గోదావరి నీటిమట్టం 44 అడుగులకు చేరుకోవడంతో మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు అధికారులు. సాయంత్రానికి రెండో ప్రమాద హెచ్చరిక జారీచేసే అవకాశం ఉంది. దేవీపట్నం దగ్గర పలు గిరిజన గ్రామాలను సురక్షిత ప్రాంతాలకు చేర్చేందుకు ప్రయత్నిస్తున్నారు. సబ్ కలెక్టర్ వినోద్ కుమార్ నేతృత్వంలో ఐదు సహాయక బృందాలు దేవీపట్నం, తొమ్మేరు , వీరపురలంక, మంటూరు, పూడిపల్లి,కుచ్చులూరు, ఏనుగులగొంది, కొండమొదలు ప్రాంతాల్లో రెస్క్యూ చేపట్టాయి. గిరిజన గ్రామాల్లో సహయక స్థావరాలను ఏర్పాటు చేశారు.

భారీగా కురుస్తున్న వర్షాలతో గోదావరి,శబరీ నదుల్లో నీటి మట్టం అంతకంతకు పెరుగుతోంది. దీంతో తూర్పు గోదావరి జిల్లా అధికారులు అప్రమత్తమయ్యారు. ధవళేశ్వరం బ్యారేజీ నుంచి లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. వరద పరిస్థితిని అంచనా వేసేందుకు అధికారులు ఎప్పటికప్పుడు సమీక్షలు జరుపుతున్నారు.

- ఉచితంగా మీ జాతకాన్ని తెలుసుకోండి -