కేరళ చరిత్రలోనే తొలిసారిగా కొచ్చి విమానాశ్రయం మూసివేత

రెండు వారాలుగా వరుణుడు సృష్టించిన భీబత్సం నుంచి ఇంకా దేవభూమి బయటపడలేదు. భారీ వర్షాలతో మరణించిన వారి సంఖ్య 173కు పెరిగింది. ఇందులో వందమందికిపైగా మృతులు కేవలం గత 36 గంటల్లోనే చనిపోయారు. మృతుల సంఖ్య ఇంకా పెరిగే ఆవకాశాలున్నాయి. ఆస్తి నష్టం అంచనాకు అందడం లేదు. ఇంకా వర్షాలు వీడడం లేదు. ప్రాజెక్టులకు వరద పోటెత్తుతోంది. కొండచరియలు పేకమేడల్లా కూలుతున్నాయి. కన్నూర్‌, మున్నార్‌, అలెప్పి వంటి పర్యాటక క్షేత్రాల్లో భారీ నష్టం సంభవించింది. 40 నదుల్లో వరద ప్రవాహం అంతకంతకూ పెరుగుతోంది. దీనికితోడు శుక్ర, శనివారాల్లో భారీ వర్షాలకు అవకాశం ఉందన్న వాతావరణ శాఖ హెచ్చరికలు ఆందోళన కలిగిస్తున్నాయి.

వరదల ధాటికి కేరళాలోని అన్ని నదులు ఉప్పొంగుతున్నాయి. దాదాపు 35 నదులపై గేట్లు ఎత్తు నీటిని దిగువకు వదులుతున్నారు. దీంతో లోతట్టు ప్రాంతాల ప్రజలకు భయంతో గడపాల్సి వస్తోంది. వరద ధాటికి పలు రోడ్లు కొట్టుకుపోగా బ్రిడ్జ్ లు సైతం నీట మునిగాయి. 14 జిల్లాల్లోని చాలా ప్రాంతాలకు రాకపోకలు స్థంభించాయి. దీంతో జనజీవనం ఎక్కడికక్కడ స్థంభించిపోయింది. కేరళ చరిత్రలోనే తొలిసారిగా కొచ్చి విమానాశ్రయం మూసివేశారు. ప్రయాణికులతో అత్యంత రద్దీగా ఉండే విమానాశ్రయాలలో దేశంలో నాలుగోదిగా కొచ్చికి పేరుంది. రన్ వేపై భారీగా వర్షపు నీరు నిలిచిపోవడంతో ఈ నెల 26 వరకు రాకపోకలు నిలిపివేశారు. ఇక నగరంలో మెట్రో సర్వీసులు నిలిచిపోయాయి. తిరువ్వల్ – ఎర్నాకులం వెళ్లే ఎంసీ రోడ్డును మూసివేశారు. సలేం కొచ్చి జాతీయ రహదారిని పూర్తిగా మూసివేసి… రాకపోకలను నిషేధించారు. విద్యుత్ స్థంభాలు కూలిపోవడం, కేబుల్ కనెక్షన్లు ధ్వంసం అవటంతో చాలా ప్రాంతాలకు విద్యుత్‌ సరఫరా కూడా నిలిచిపోయింది.

కనుచూపు మేరలో నీరే కనిపిస్తుండటంతో జలదిగ్బంధంలో చిక్కుకున్న ప్రజలు ఎటూ వెళ్లాలో తెలియక భయంతో గడుతుపుతున్నారు. సహాయక చర్యలు నిర్విరామంగా జరుగుతున్నా..బాధితుల సంఖ్య ఎక్కువగా ఉండటంతో బృందాల సంఖ్యను మరింత పెంచనున్నారు. దాదాపు 339 పడవలు, హెలికాఫ్టర్లతో వరద బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. 2 వేల 800 లైఫ్‌ జాకెట్లు పంపిణి చేశారు. మరో ఐదు వేల లైఫ్‌ జాకెట్లను సిద్ధం చేస్తున్నారు. లక్ష ఆహార పొట్లాలను బాధితులకు పంచారు. ఇక ముళ్లపెరియార్‌ ప్రాజెక్టులో నీటి మట్టంపై సుప్రీం కోర్టు అరా తీసింది. 14 జిల్లాల్లో వరద ప్రభావం ఉండటంతో ప్రాజెక్టులో నీటి మట్టాన్ని 142 అడుగుల నుంచి 139 వరకు తగ్గించాలని సుప్రీం కోర్టు ఆదేశించింది. కేరళా వరద బీభత్సాన్ని పరిశీలించేందుకు ప్రధాని మోడీ కేరళా వెళ్లనున్నారు.

- ఉచితంగా మీ జాతకాన్ని తెలుసుకోండి -