భారీ వర్షాలకు విలవిల్లాడుతున్న కేరళ

భారీ వర్షాలకు కేరళ విలవిల్లాడుతోంది. వరద ఉధృతి అంతకంతకూ ఎక్కువవుతోంది. కొండప్రాంతాల్లో కొండ చరియలు విరిగిపడి తొంభై మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. వాగులు, వంకలు ఉప్పొంగుతున్నాయి. రాష్ట్రంలోని 35 ప్రధాన జలాశయాల గేట్లు ఎత్తేశారు. దీంతో లోతట్టు ప్రాంతాల ప్రజలు భయం గుప్పిట్లో కాలం వెళ్లదీస్తున్నారు. ప్రమాదం ఎప్పుడు ముంచుకొస్తుందోనని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సుమారు లక్షన్నర మంది పునరావాస కేంద్రాల్లో ఆశ్రయం పొందుతున్నారు. రవాణా వ్యవస్థ పూర్తిగా ధ్వంసమవడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది.

మరోవైపు, కొచ్చి ఎయిర్‌ పోర్టులోకి భారీగా వరదనీరు వచ్చి చేరింది. ఎయిర్‌ పోర్టు చెరువును తలపిస్తోంది. ఎంతకీ వరద ఉధృతి తగ్గకపోవడంతో శనివారం వరకు ఎయిర్‌పోర్టును మూసివేస్తున్నట్టు అధికారులు ప్రకటించారు. ఉత్తరాన కాసర్‌గోడ్‌ నుంచి తిరువనంతపురం వరకు అన్ని నదులూ పొంగిపొర్లుతుండటంతో వరదలు మరింత పోటెత్తుతున్నాయి. ఇప్పటికే రాష్ట్రంలోని పద్నాలుగు జిల్లాల్లో రెడ్‌అలర్ట్‌ ప్రకటించింది ప్రభుత్వం.

ఇక, ప్రధానమంత్రి నరేంద్రమోది ఈ సాయంత్రం కేరళకు చేరుకోనున్నారు. శనివారం ఆయన వరద ప్రాంతాల్లో ఏరియల్‌ సర్వే నిర్వహించనున్నారు. ఇప్పటికే రాష్ట్రముఖ్యమంత్రి పినరయి విజయన్‌తో ఫోన్‌లో మాట్లాడిన ప్రధాని .. ఎప్పటికప్పుడు వరద పరిస్థితిపై సమాచారాన్ని తెలుసుకుంటున్నారు. ఇక, ప్రధాని ఆదేశాలతో ఇండియన్‌ ఆర్మీ, నేవీ సహాయక బృందాలు సహాయక చర్యల్లో నిమగ్నమయ్యాయి.