నేను ఎంపీగా పోటీ చేయాలంటే నలుగురు అభ్యర్థుల్ని మార్చాలి : టీడీపీ నేత

mlc magunta srinivasulureddy conditions apply contesting by next elections

ప్రకాశం జిల్లాలో టీడీపీ సీనియర్ నేత కరణం బలరాంకు 2014 ఎన్నికలలో అధిష్టానం సీటు కేటాయించ లేదు. కుమారుడు వెంకటేష్ కు అద్దంకి టిక్కెట్ ఇచ్చారు.అయితే ఆ ఎన్నికల్లో వైసీపీ తరుపున పోటీ చేసిన గొట్టిపాటి రవికుమార్ గెలుపొందటం, తదనంతరం జరిగిన పరిణామాల్లో గొట్టిపాటి తెలుగుదేశం లో చేరటం చకా చకా జరిగిపోయాయి. నాటి నుంచి నేటి వరకు కరణం బలరాం కుటుంబాన్ని అద్దంకి నియోజకవర్గానికి దూరంగా ఉంచేందుకే చంద్రబాబు ప్రయత్నించారు. అద్దంకి భాధ్యత పూర్తిగా గొట్టిపాటి రవిదేనని,రానున్న ఎన్నికలలో ఆయనకే సీటు కేటాయిస్తామని కూడా చంద్రబాబు పలుసార్లు స్పష్టం చేశారు. అయితే బలరాం సంతృప్తి చెందకపోవటంతో ఏదో ఒక పదవి తీసుకోవాలని ప్రతిపాదించారు. ఆ సమయంలో ఆర్టీసీ ఛైర్మన్ ఇవ్వాలని బలరాం కోరగా, అది వీలు పడక ఎమ్మెల్సీ పదవి కేటాయించారు. కానీ ఎమ్మెల్సీ పదవి పట్ల బలరాం సంతృప్తిగా లేరు. వచ్చే ఎన్నికల్లో తన పాత్రేంటో చెప్పాలని నేరుగా చంద్రబాబునే అడినట్లు తెలుస్తోంది. తనకు గానీ,తన కుమారుడికి గానీ అద్దంకి, పర్చూరు నియోజక వర్గాల్లో ఏదో ఒకటి కేటాయించాలని చంద్రబాబును కోరారు. అయితే ఆ రెండు నియోజక వర్గాల్లోనూ పార్టీ శాసనసభ్యులే కావటంతో అధినేత బలరాంకు ఎటువంటి భరోసా ఇవ్వలేదని తెలుస్తోంది. చంద్రబాబు నుంచి ఎలాంటి సమాధానం లభించక పోవటంతో అద్దంకి నియోజకవర్గంలో తన వర్గాన్ని కూడగట్టుకొనేందుకు బలరాం ప్రయత్నాలు మొదలుపెట్టారు. దీనిపై గొట్టిపాటి రవి వర్గం చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లింది. ఈ విషయంపై అధినేత సీరియస్ గా ఉన్నట్లు తెలుస్తోంది. దీనిపై ఇంటిలిజెన్స్ నివేదిక కూడా తెప్పించుకున్నారు. తమ కుటుంబానికి సీటు కేటాయించకపోతే.. రెబల్ గా బరిలో దిగాలని.. లేదంటే పార్టీ మారేందుకు సిద్దపడినట్టు తెలుస్తోంది. ఇది పార్టీలో కలకలం రేపుతోంది.

అటు ఒంగోలు పార్లమెంట్ నియోజకవర్గ అభ్యర్దిగా పోటీ చేస్తారని భావిస్తున్న మాగుంట శ్రీనివాసులు రెడ్డి సైతం చంద్రబాబు ముందు తన విముఖత ప్రదర్శించినట్లు సమాచారం. తాను ఎంపీగా పోటీ చేసేకంటే ఎమ్మెల్సీగా ఉండటానికే ఇష్టపడుతున్నానని చెప్పినట్లు తెలిసింది. కాదు కూడదు తనను ఎంపీగానే పోటీ చేయించాలని పార్టీ భావిస్తే ఒంగోలు పార్లమెంట్ నియోజకవర్గంలో నలుగురు సిట్టింగ్ లను మార్పుచేయాలని కోరినట్లు సమాచారం. యర్రగొండపాలెం, మార్కాపురం, కనిగిరి, కొండేపి నియోజకవర్గాల అభ్యర్ధులను మారిస్తేనే ఒంగోలు పార్లమెంట్ బలోపేతం అవుతుందని, అప్పుడు మాత్రమే తన గెలుపు సాధ్యమవుతుందని మాగుంట అధినేతతో చెప్పినట్లు తెలుస్తోంది. మాగుంట చెప్పిన ప్రకారం నలుగురు అభ్యర్ధులను మార్పుచేయడం అంత సులభం కాదు. మాగుంట సూచనల మేరకు జిల్లాపై దృష్టి సారించిన చంద్రబాబు సర్వేల అనంతరం అభ్యర్ధులను మార్పు చేస్తారా…లేక మాగుంటను ఒప్పిస్తారా అన్న విషయం ఆసక్తిగా మారింది. మాగుంట ప్రతిపాదనకు అధిష్టానం అంగీకరించకపోతే మాగుంట ఏ నిర్ణయం తీసుకుంటారన్న విషయం కూడా ఆసక్తికరంగా మారింది. పైగా బలమైన మరో ప్రత్యామ్నాయం కూడా కనిపించడం లేదు. వైవీ సుబ్బారెడ్డిని ఢీకొట్టాలంటే ఆయనే సరైన అభ్యర్థి అన్న భావన తమ్ముళ్లలో ఉంది.

ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గంలో కూడా పార్టీకి ఈదర హరిబాబు తలనొప్పిగా మారారు. పార్టీ వ్యతిరేక చర్యలకు పాల్పడినందుకు గతంలో ఆయన్ను పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. కానీ ఇప్పటికీ తెలుగుదేశం పార్టీనే అంటున్నారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ నుంచి బరిలో దిగుతానని.. లేదంటే రెబల్ గా పోటీచేస్తానని చెబుతున్నారు. ఈదరహరిబాబుకు పార్టీ నుంచి బయటకు పంపినా… ఆయనకంటూ ఓ వర్గం ఉంది. పార్టీలో ఓటుబ్యాంకు చీలే ప్రమాదం ఉంది. మొత్తానికి సీనియర్లను చల్లబరిచి, రాజీకి తీసుకురాగలిగితే పర్వాలేదు.. లేకుంటే ప్రస్తుతం ఉన్న పరిస్దితుల్లో సీనియర్లతో ఇబ్బందులు ఎదురయ్యే పరిస్దితులే కన్పిస్తున్నాయి. మరి అధినేత ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో.. నాయకులు దేనికి కట్టబడుతారో చూడాలి.

- ఉచితంగా మీ జాతకాన్ని తెలుసుకోండి -