ప్రధానిగా ఉన్న రాజీవ్.. ప్రతిపక్షంలో ఉన్న వాజ్‌పేయికి..

రాజకీయాలలో శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు ఉండరన్న మాట నిజం. శత్రువైనా ఆపదలో ఆదుకుంటే మిత్రుడిగానే పరిగణిస్తాం. మనసున్న మంచి మనిషిగా స్పందిస్తే జీవితాంతం గుండెల్లో పెట్టుకుంటాం. అలాంటి అనుభవమే ఎదురైంది దివంగత మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయికి 1988లో ఓసారి. అప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. రాజీవ్ గాంధీ ప్రధాన మంత్రి హోదాలో దేశాధినేతగా ఉన్నారు.

ప్రతిపక్ష నేతగా ఉన్న వాజ్‌పేయి కిడ్నీ వ్యాధితో బాధపడుతున్నట్లు రాజీవ్ తెలుసుకున్నారు. వెంటనే ఆయన్ని తన కార్యాలయానికి రమ్మని ఆహ్వానించారు. ఆరోగ్య పరిస్థితిని గురించి అడిగి తెలుసుకున్నారు. ఆ సమయంలో ఐక్యరాజ్యసమితి సదస్సుకు బృందాన్ని పంపే ఏర్పాట్లు జరుగుతున్నాయి. రాజీవ్, వాజ్‌పేయితో ఐరాస సదస్సుకు వెళ్లే సభ్యుల్లో మిమ్మల్ని కూడా చేరుస్తున్నాను.

సదస్సు అనంతరం న్యూయార్క్ వెళ్లి వైద్యం చేయించుకోవాలని వాజ్‌పేయికి సూచించారు. అనుకోకుండా వచ్చిన అవకాశానికి ఆనందంగా ఒప్పుకున్నారు వాజ్‌పేయి. ఐరాస సదస్సు అనంతరం కిడ్నీ ఆపరేషన్‌ని చేయించుకుని వచ్చారు. ఈ విషయాన్ని వాజ్‌పేయి స్వయంగా సీనియర్ పాత్రికేయుడు కరణ్ థాపర్‌తో పంచుకున్నారు. తానీ రోజు బ్రతికి ఉన్నానంటే అందుకు రాజీవ్ కారణమని పలు సందర్భాల్లో ఇచ్చిన ఇంటర్వ్యూల్లో ఈ అంశాన్ని ప్రముఖంగా ప్రస్తావించేవారు.

- ఉచితంగా మీ జాతకాన్ని తెలుసుకోండి -