ముగిసిన మహా సంప్రోక్షణ

thirumala-mahasamprokshana-ends

శ్రీవారి పుష్కరోత్సవం ముగిసింది.. మహా సంప్రోక్షణ క్రతువు ఐదు రోజులపాటు వైభవోపేతంగా సాగింది. కలశంలో ఉన్న వెంకటేశ్వరస్వామి అంశను తిరిగి మూలవిరాట్టులోకి ప్రవేశింపజేశారు అర్చకులు. క్రతువు ముగిసిన అనంతరం భక్తులను దర్శనానికి అనుమతించారు. మరోవైపు గరుడ పంచమి సందర్భంగా శ్రీవారు గరుడ వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు.

తిరుమల శ్రీవారి ఆలయంలో ఐదు రోజుల పాటు కొనసాగిన మహా సంప్రోక్షణ ఘనంగా ముగిసింది. సంప్రోక్షణ ముగింపు సమయంలో యాగశాలలోని కుంభాలతో పాటు ఉత్సవ విగ్రహాలను పూర్వపు స్థానాల్లో ఉంచారు. ఆనంద నిలయ విమానగోపురంపై ఉన్న స్వర్ణ కలశానికి ముందుగా సంప్రోక్షణ చేసి కుంభంతో కళా ఆవాహనం చేశారు. ఆనంతరం గర్భాలయంలో శ్రీవారి విరాణ్మూర్తికి, ఉప ఆలయాల్లో, గోపుర శిఖరాల కలశాలకు కూడా కళావాహనం చేశారు. 44 మంది రుత్వికులు, 100 మంది వేద పండితులు ఈ క్రతువులో పాల్గొన్నారు.

అంతకు ముందు మూలమూర్తికి ఇతర దేవతా పరివారానికి క్షీరాధివాస తిరుమంజనం క్రతువు ఆగమోక్తంగా నిర్వహించారు. విగ్రహాలకు ప్రాణప్రతిష్ఠ సమయంలో విశ్వంలోని శక్తిని ఆవాహన చేయడానికి అధివాసం నిర్వహిస్తారు. ప్రాణప్రతిష్ట ద్వారా విగ్రహాలు అనంతమైన శక్తిని పొందుతాయి. ఇలాంటి విగ్రహరూపంలో ఉన్న దేవతలను దర్శించడం ద్వారా కోరికలు నెరవేరడంతోపాటు మానసిక శాంతి కలుగుతుంది. శాస్త్రాల ప్రకారం ఆలయ ప్రాణప్రతిష్ఠ సమయంలో క్షీరాధివాసం, జలాధివాసం, ఫలాధివాసం, ఛాయాధివాసం, ధాన్యాధివాసం, పుష్పాధివాసం, శయనాధివాసం నిర్వహిస్తారు. మూలమూర్తిని పవిత్రమైన పాలతో అభిషేకించడాన్ని క్షీరాధివాసం అంటారు. అలాగే శ్రీవారి ఆలయ గోపురాల కలశాలను అద్దంలో చూపించి వాటి ప్రతిబింబాలకు అభిషేకం నిర్వహించారు. విమాన వేంకటేశ్వరస్వామి, గరుడాళ్వార్‌, వరదరాజస్వామి, భాష్యకారులు, యోగ నరసింహస్వామి, ధ్వజస్తంభం, బేడి ఆంజనేయస్వామి గోపురాల కలశాలకు పవిత్రమైన జలం, పాలతో అభిషేకం చేశారు.

ఇక సాయంత్రం శ్రీవారు పెద్ద శేష, గరుడ వాహనాలపై విహరించారు. గరుడ పంచమి రావడంతో శ్రీవారికి గరుడవాహన సేవ నిర్వహించారు. గరుడ వాహనంపై ఉత్సవ మూర్తిని పెద్ద సంఖ్యలో భక్తులు దర్శించుకున్నారు. తిరుమాడ వీధుల్లో మంగళ హారతులు పట్టారు. అనంతరం యాగశాలలో చివరగా హోమాలు జరిపించి, అర్చకులకు, రుత్వికులకు బహుమానాలు సమర్పించారు. మరో వైపు గురువారం అర్ధరాత్రి నుంచే దివ్యదర్శనం, సర్వదర్శనం టోకెన్ల జారీని టీటీడీ పునరుద్ధరించింది.