వాజ్‌పేయికి సినీ, రాజకీయ, క్రీడా ప్రముఖుల నివాళి

Tribute to Vajpayee's political and film personalities

మాజీ ప్రధానమంత్రి వాజ్‌పేయి మరణం పట్ల రాజకీయ, సినీ ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయనతో తమకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. వాజ్‌పేయి కన్నుమూత దేశ ప్రజలకు తీరనిలోటని రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ అన్నారు. అటల్‌ జీ లేరన్న వార్త తనను కలచివేసిందని.. ఆయన మృతి పట్ల తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నట్లు తెలిపారు.

వాజ్‌పేయి దేశానికి లభించిన గొప్పనాయకుడని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. అటల్‌జీ మృతిపట్ల భారతీయులకు తీరని లోటని వ్యాఖ్యానించారు. దేశానికి ప్రత్యామ్నాయ మార్గాన్ని అందించిన గొప్ప సంస్కర్త అని కొనియాడారు.

భారతదేశం ఓ గొప్ప నాయకుడిని కోల్పోయిందని లోక్‌సభ స్పీకర్‌ సుమిత్రా మహాజన్‌ అన్నారు. వాజ్‌పేయి అస్తమయం ఎంతో మంది గుండెలను ద్రవింపజేసిందని చెప్పారు.

వాజ్‌పేయి మరణంతో ఓ శకం ముగిసిందని మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ అన్నారు. గొప్ప ప్రజాస్వామ్య వాదిని కోల్పోయామని ఆవేదన వ్యక్తం చేశారు.

వాజ్‌పేయి మరణంపై మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్‌ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఆయన ఒక గొప్ప వక్త, మంచి కవి, ప్రజా సేవకుడు, ఒక గొప్ప ప్రధానమంత్రి అని కొనియాడారు.

అటల్ జీ మృతికి ట్విట్టర్ వేదికగా సినీ, రాజకీయ, క్రీడా ప్రముఖులు నివాళులర్పించారు. వాజ్‌పేయిని తాను బాపూజీ అంటూ ఆప్యాయంగా పిలచుకునేవాడినని బాలీవుడ్ సూపర్ స్టార్ షారుక్‌ఖాన్ ట్వీట్ చేశారు. ఆయన్ను కలిసే భాగ్యం తనకు కలిగిందని.. కవిత్వం, సినిమాలు, రాజకీయాల గురించి బోలెడు విషయాలు చర్చించుకున్నామన్నారు. ఇక.. భరత జాతికి అటల్‌ జీ చేసిన సేవలు మరువలేనివన్న సచిన్‌… ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు