అన్ని జిల్లాల నదుల్లో వాజ్‌పేయి అస్థికల నిమజ్జనం

atal-bihari-vajpayee-funeral-updates-hundreds-queue-up-to-pay-tributes-to-the-former-prime-minister

మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి అంత్యక్రియలు లక్షలాది మంది ప్రజలు, ఆప్తులు, కుటుంబ సభ్యుల అశ్రునయనాల మధ్య నిర్వహించారు. యమునా నదీ తీరంలోని రాష్ట్రీయ స్మృతిస్థల్‌లో అంతిమ సంస్కారాలు చేశారు. అటల్‌ దత్తపుత్రిక నమిత.. వాజ్‌పేయి చితికి నిప్పంటించగా, హిందూ సంప్రదాయం ప్రకారం దహన సంస్కారాలు పూర్తి చేశారు. తాత అటల్‌జీ నుంచి మనవరాలు నిహారిక చివరి కానుకగా.. ఆయన పార్థివదేహంపై కప్పిన జాతీయ పతాకాన్ని అందుకున్నారు. ఉద్వేగానికి లోనవుతూ త్రివర్ణ పతాకాన్ని వెంట తీసుకెళ్లారు.

వాజ్‌పేయి మరణం పట్ల ప్రపంచ దేశాధినేతలు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. భూటాన్‌ రాజు జిగ్మే ఖేసర్‌ నంగ్యేల్‌ వాంగ్‌చుక్‌ వాజ్‌పేయి పార్థివ దేహానికి నివాళులు అర్పించారు. అలాగే నేపాల్‌, శ్రీలంక, బంగ్లాదేశ్‌ విదేశాంగ మంత్రులు, పాకిస్థాన్‌ న్యాయశాఖ మంత్రి ఢిల్లీ చేరుకుని వాజ్‌పేయి పార్థివ దేహానికి నివాళులర్పించారు. ఆఫ్గనిస్తాన్‌ మాజీ ప్రెసిడెంట్‌ హమీద్‌ ఖర్జాయ్‌ కూడా అటల్ జీకి నివాళులు అర్పించారు. వారితో పాటు రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ప్రధాని మోడీ, లోక్‌సభ స్పీకర్‌ సుమిత్రా మహాజన్‌, రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్‌, త్రివిధ దళాధిపతులు, మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్‌, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా, సీనియర్‌ నేతలు అద్వానీ సహా పలువురు స్మృతి స్థల్‌లో మహానేతకు అంజలి ఘటించారు.

అంతకుముందు అశేష జనవాహిని నడుమ బీజేపీ ప్రధాన కార్యాలయం నుంచి రాష్ట్రీయ స్మృతిస్థల్‌కు వాజ్‌పేయి అంతిమయాత్ర కొనసాగింది. తమ ప్రియతమ నేతను కడసారి చూసేందుకు ప్రజలు భారీగా తరలివచ్చారు. దీంతో ఢిల్లీ వీధులు కిక్కిరిశాయి.

అంతిమ యాత్రలో ప్రధాని మోడీ, బీజేపీ అధ్యక్షుడు అమిత్‌ షా… వాజ్‌పేయిపై తమకున్న గౌరవాన్ని చాటుకున్నారు. నాలుగు కిలోమీటర్లు సాగిన అంతిమయ యాత్రలో మోడీ, అమిత్‌షా, మధ్యప్రదేశ్‌, మహారాష్ట్ర ముఖ్యమంత్రులు శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌, దేవేంద్ర ఫడ్నవీస్‌ కాలినడకన పాల్గొన్నారు. తమకు రాజకీయ జీవితాన్ని ఇచ్చిన నేతపై అభిమానాన్ని చాటుకున్నారు. అంతిమయాత్ర సాగుతున్నంతసేపూ అటల్‌ జీ అమర్‌ రహే నినాదాలు మార్మోగాయి. మరోవైపు వాజ్‌పేయి అస్థికలను ఉత్తర్‌ప్రదేశ్‌లోని అన్ని జిల్లాల్లో ఉన్న నదుల్లో నిమజ్జనం చేయనున్నట్లు సీఎం యోగి ఆదిత్యనాథ్‌ వెల్లడించారు.

- ఉచితంగా మీ జాతకాన్ని తెలుసుకోండి -