గర్భిణిని కాపాడి పురుడు పోసిన నేవీ బృందం..

ప్రార్థించే పెదవులకన్నా సాయం చేసే చేతులు మిన్న అన్న మహానుభావుల మాటలు అక్షర సత్యం. ఈ విషయాన్ని పదే పదే నిరూపిస్తూనే ఉంటారు మన భారత సైన్యం. సరిహద్దులో పగలు, రేయి పహారా కాస్తూ దేశాన్ని, దేశ ప్రజలను కంటికి రెప్పలా కాపాడుతుంటారు. తమ ప్రాణాలను ఫణంగా పెడుతుంటారు.

వరదల్లో చిక్కుకున్న కేరళ ప్రజలకు ధైర్యాన్ని మేమున్నాం మీకేంకాదు అంటూ చేయందిస్తున్నారు. ప్రసవ వేదన పడుతున్న ఓ నిండు గర్భిణి వరదల్లో చిక్కుకుని సాయం కోసం అర్థిస్తోంది కొచి ప్రాంతానికి చెందిన సజిత అనే మహిళ. పరిస్థితిని అర్థం చేసుకున్న ఆర్మీ టీం ఏమాత్రం ఆలస్యం చేయకుండా రంగంలోకి దిగారు. ఎన్డీఆర్ఎఫ్, ఎయిర్‌ఫోర్స్ సిబ్బంది సాయంతో హెలికాప్టర్ ద్వారా ఆమెను కార్పోరేట్ ఆసుపత్రికి తరలించారు.

వైద్యుల పర్యవేక్షణలో పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. సజితను తాడు సాయంతో హెలికాప్టర్‌లోకి చేరుస్తున్న వీడియో వైరల్ అవుతోంది. ఎడతెగని వర్షాల కారణంగా రాష్ట్రంలో ఇప్పటి వరకు 324 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. 2.20 లక్షల మంది నిరాశ్రయులయ్యారు. ఉప్పొంగుతున్న నదీ ప్రవాహాలు, కొండచరియలు విరిగిపడుతుండడం రాష్ట్ర ప్రజలను భయాందోళనకు గురిచేస్తున్నాయి.