అక్కడ వైసీపీలో సీటు ధనలక్ష్మికేనా..?

rampachodavaram-politics

తూర్పు గోదావరి జిల్లాలోని ఏకైక ఎస్టీ రిజర్వుడు నియోజకవర్గం రంపచోడవరం. సుదీర్ఘకాలం పాటు ఇక్కడ తెలుగుదేశం హవా నడిచింది. ఆపార్టీ ఆవిర్భావం తర్వాత సైకిల్ జోరుకి తిరుగులేకుండా పోయింది. కానీ గత 2ఎన్నికల్లోనూ సైకిల్ స్పీడుకు బ్రేకులు పడ్డాయి. 2014 ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి వంతల రాజేశ్వరి ఇక్కడ నుంచి గెలిచారు. అయితే ప్రస్తుతం ఆమె పార్టీ ఫిరాయించి టీడీపీలో చేరారు. 2014లో గెలిచిన ఈ సీటును మళ్లీ కైవసం చేసుకోవాలని వైసీపీ ఆశిస్తోంది. అయితే గత వైభవం సాధించి సత్తా చాటాలని టీడీపీ భావిస్తోంది. అదే సమయంలో పోలవరం విలీన మండలాల్లో గట్టి పునాదులున్న వామపక్షాలు కూడా ఈ సీటుపై కన్నేశాయి. దాంతో ఇక్కడ ముక్కోణపు పోరు తప్పేలా లేదు.

తెలుగుదేశం పార్టీ తరుపున మరోసారి తనకు అవకాశం వస్తుందని మాజీ ఎమ్మెల్యే శీతంశెట్టి వెంకటేశ్వరరావు ఆశిస్తున్నారు. మరో మాజీ ఎమ్మెల్యే చిన్నం బాబు రమేష్ కూడా సీటు మీద కన్నేశారు. అయితే మళ్లీ టికెట్ ఇస్తారని నమ్మకంతో ఎమ్మెల్యే వంతల రాజేశ్వరి టీడీపీ గూటికి చేరినట్టు ఆమె సన్నిహితులు చెబుతున్నారు. వై.రామవరానికి చెందిన గొర్లె శ్రీకాంత్, ఎటపాకకి చెందిన ఫణీశ్వరమ్మ వంటి వారూ కూడా టికెట్ రేసులో ఉన్నారు. టీడీపీలో టికెట్ కోసం ఎవరికి వారు గట్టి ప్రయత్నాల్లో ఉన్నారు. ఇక ప్రధాన ప్రతిపక్షం వైసీపీ అభ్యర్థి విషయంలో దాదాపు క్లారిటీ వచ్చేసింది. ఈసారి కూడా మహిళా అభ్యర్థికే అవకాశం ఇవ్వబోతున్నట్టు సంకేతాలు ఇచ్చారు. నియోజకవర్గ కోఆర్డినేటర్ గా నియమితురాలైన నాగులపల్లి ధనలక్ష్మి బరిలో దిగడం దాదాపు ఖాయమంటున్నారు. ఇటీవల జిల్లా పర్యటనలతో కూడా జగన్ ధనలక్ష్మికే నియోజకవర్గంలో పనిచేసుకోవాలని ఆదేశించినట్టు చెబుతున్నారు.

సీపీఎం తరపున ప్రస్తుతం భద్రాచలం ఎమ్మెల్యేగా ఉన్న సున్నం రాజయ్య గానీ, మాజీ ఎంపీ మిడియం బాబూరావు గానీ పోటీ చేసే అవకాశం ఉంది. పోలవరం విలీన మండలాల్లో ఆపార్టీకి బలం ఉంది. దాంతో రంపచోడవరం డివిజన్ పరిధిలో కూడా కొంత ప్రభావం చూపగలిగితే ఈ సీటు తమ ఖాతాలో పడుతుందనే అంచనాల్లో సీపీఎం ఉంది. పోలవరం నిర్వాసితుల సమస్యలతో పాటు గిరిజన ప్రాంతాల్లో మౌలిక వసతులు లేకపోవడం నియోజకవర్గంలో ప్రధాన సమస్యలుగా ఉన్నాయి. విద్య, వైద్య సదుపాయాలు అందుబాటులో లేకపోవడం కూడా ఓ ప్రధానాంశం. ఇటీవల చాపరాయి వంటి మారుమూల గ్రామాల్లో విషజ్వరాలతో పదుల సంఖ్యలో ప్రాణాలు కోల్పోవడం విషాదం నింపింది. ఈ నేపథ్యంలో గిరిజనుల అండదండలు ఎవరికి లభిస్తాయో చూడాలి. గత ఎన్నికల్లో దాదాపుగా అన్ని ఎస్టీ స్థానాలను తన ఖాతాలో వేసుకున్న వైసీపీ ఈసారి కూడా రంపచోడవరం మీద గంపెడాశతో కనిపిస్తోంది. టీడీపీ మాత్రం గట్టి పట్టుదలతో సాగుతోంది. సీపీఎం సత్తా చాటాలని చూస్తోంది. దాంతో ట్రయాంగిల్ ఫైట్ లో చివరకు ఏం జరుగుతుందన్నది తేలాలంటే వచ్చే ఎన్నికల వరకూ ఆగాల్సిందే.