మూడు నెలలుగా బాలికపై పాస్టర్‌ అత్యాచారం

తూర్పు గోదావరి జిల్లా కాకినాడలో దారుణం జరిగింది. ప్రార్థనల పేరుతో మాయమాటలు చెప్పి ఓ బాలికపై దారుణానికి ఒడిగట్టిన పాస్టర్‌ ఉదంతం ఆలస్యంగా వెలుగు చూసింది. కాకినాడ రామారావుపేటలో నివాసం ఉంటున్న తాతపూడి జాషువా నిహార్‌ పర్లోపేట ప్రాంతంలో హాస్‌ ఆఫ్‌ సాల్వేషన్ పేరుతో ఒక చర్చ్ నిర్వహిస్తున్నాడు. ఇదే ప్రాంతానికి చెందిన 15 ఏళ్ల బాలికను దైవకార్యమని మభ్యపెట్టి లోబర్చుకున్నాడు. మూడు నెలలుగా రామారావుపేటలోని తన నివాసానికి ప్రార్థనల పేరిట బాలికను పిలిపించుకుని పలుమార్లు అత్యాచారం చేశాడు. ఇది అత్యంత పవిత్రమైందంటూ బాలికను నమ్మించాడు. ఎవరికైనా చెబితే.. నాశనమై నరకానికి పోతావంటూ బెదిరించి మరీ అత్యాచారానికి పాల్పడ్డాడు.

మూడు నెలలుగా ఈ తంతు సాగుతుండడంతో.. బాలిక విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పింది. దీంతో కీచక పాస్టర్ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. బాలిక తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించారు. నిందితుడు జాషువాపై పోలీసులు పోక్సా చట్టంతో పాటు, కిడ్నాప్, అత్యాచారం సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. బాలికను వైద్య పరీక్షల కోసం ఆస్పత్రికి తరలించారు.

- ఉచితంగా మీ జాతకాన్ని తెలుసుకోండి -