కేరళాలో ఆశాజనక వాతావరణం

పది రోజుల తర్వాత కేరళాలో వాతావరణం ఆశాజనకంగా మారింది. వర్షాలు తెరిపినివ్వటంతో అన్ని జిల్లాలో రెడ్ అలర్ట్ ఉపసంహరించుకున్నారు. సహాయక చర్యలను ముమ్మరం చేసింది ప్రభుత్వం. ఈ పది రోజుల్లో మృతుల సంఖ్య 385కి పెరిగింది. వర్షం తగ్గినా..ఇంకా నడుములోతు నీటిలోనే కేరళ నానుతోంది.

దేవభూమిపై పగబట్టినట్టుగా కుమ్మరించిన వర్షం ఎట్టకేలకు తగ్గింది. కానీ, పది రోజుల పాటు సృష్టించిన జల విలయ ప్రభావం కొనసాగుతోంది. వందేళ్లలో ఎన్నడూ లేనంతగా కురిసిన వర్షంతో కేరళ చితికిపోయింది.

రాష్ట్రంలో 14 జిల్లాలు ఉంటే 13 జిల్లాలు పది రోజులుగా నీటిలోనే ఉన్నాయి. నీటి కోతతో ఇళ్ల కింద పునాదులు చెదిరి..ఇళ్లు పేకమేడల్లా కూలిపోతున్నాయి. దాదాపు పది లక్షల మంది నిరాశ్రయులైనట్లు అంచనా వేస్తున్నారు. 60 వేల కిలోమీటర్ల మేర రోడ్లు ధ్వంసం అయ్యాయి. దాదాపు 20 వేల కోట్ల మేర ఆస్తి నష్టం జరిగినట్లు ప్రాధమికంగా అంచనా వేశారు.

ఎడతెరిపి లేకుండా పది రోజుల పాటు కేరళలో వినాశనం సృష్టించిన వర్షం సోమవారానికి మరింత తగ్గనుందని.. భారత వాతావరణ శాఖ ఆశాజనక ప్రకటన చేసింది. మరో ఐదు రోజుల పాటు వర్షాలు కురవకపోవచ్చని ఐఎండీ రిపోర్ట్ తో కేరళలోని అన్ని జిల్లాలో రెడ్ అలర్ట్ ఉపసంహరించుకున్నారు. రెండు జిల్లాల్లో మాత్రం ఎల్లో అలర్ట్ కొనసాగుతోంది.

వర్షం తగ్గినా.., పటనంతిట్ట, ఇడుక్కి, ఎర్నాకుళంతో సహా పది జిల్లాల్లో ప్రజలు నడుం లోతు నీటిలోనే గుడుపుతున్నారు. చెట్ల మీద, ఇంటి కప్పుల మీద సాయం కోసం ఎదురు చూస్తున్నారు. కనుచూపు మేర నీరే ఉండటంతో ఇంటి నుంచి కాలు కదిపే పరిస్థితి లేదు. తినేందుకు తిండి లేదు…తాగటానికి నీరు లేక జల దిగ్బంధంలో చిక్కుకుపోయారు జనం.

ఇక పాలక్కడ్ లో కొండ చరియలు విరిగిపడటంతో మృతి చెందిన వారిని వెలికి తీసే ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఇప్పటివరకు 10 మంది మృతదేహాలను వెలికితీశారు. దీంతో ఈ పది రోజుల్లో చనిపోయిన వారి సంఖ్య 385కి పెరిగింది. ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశాలున్నాయి. అల్లప్పాడ్ ప్రాంతంలో ఓ గర్బవతిని సహాయక బృందాలు సహాయశిబిరానికి చేర్చాయి. వర్షం తగ్గుముఖం పట్టడంతో ఎన్డీఆర్ఎఫ్, నేవీ, ఆర్మీ, ఇతర బృందాలు సహాయక చర్యలను మరింత ముమ్మరం చేశారు. 288 బోట్లు, 26 హెలికాఫ్టర్లతో నిరాశ్రయులను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. ప్రస్తుతం 3 లక్షల మంది పునరావాస శిబిరాల్లో ఆశ్రయం పొందుతున్నారు.

జలదిగ్బంధంలో చిక్కుకున్న వారికి ముందుగా ఆహారం చేరవేయటంపై ఫోకస్ చేశాయి సహాయక బృందాలు. హెలికాఫ్టర్ల ద్వారా ఆహార పొట్లాలను జారవిడుస్తున్నారు. ఇక వరదల ధాటికి రాష్ట్రంలో రవాణా వ్యవస్థ చిన్నాభిన్నమైంది. ముందుగా రవాణా సౌకర్యాలను మెరుగు పర్చటంపై ఫోకస్ పెడుతున్నారు. తాత్కలిక వంతెనలు, రోడ్ల నిర్మాణంలో సహాయక బృందాలు వేగం పెంచాయి. వరద బాధితులను శాటిలైట్ ద్వారా గుర్తించేందుకు ఇస్రో సాయం తీసుకుంటున్నారు. ప్రధానంగా ఐదు శాటిలైట్స్ తో రియల్ పిక్చర్స్ అధారంగా బాధితులకు సాయం అందిస్తున్నారు. ఇళ్లలోనే చిక్కుకుపోయిన వాళ్లలో ఆనారోగ్యం పాలైన వారికి ఫేస్ బుక్ ద్వారా డాక్టర్ల బృందం జాగ్రత్తలు చెబుతోంది. అయితే..నిరాశ్రాయుల సంఖ్య ఎక్కువగా ఉండటంతో ప్రస్తుతం సహాయక చర్యలు సరిపోవటం లేదు.

రాష్ట్రంలో 44 ప్రాజెక్టులకు వరద తాకిడి కొద్దిమేర తగ్గింది. ఇడుక్కి రిజర్వాయర్లో ప్రస్తుత నీటి మట్టం 2402 అడుగులకు చేరింది. రెండు గేట్ల ద్వారా గంటకు 913 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. ముల్లాపెరియర్ డ్యాంలోకి కూడా వరద తగ్గినా ఇప్పటికే పూర్తి స్థాయికి నీటి మట్టం చేరుకోవటంతో నీటిని దిగువకు వదులుతున్నారు.

వాతావరణం కొద్ది మేర ఆశాజనకంగా మారటంతో వీలున్న రవాణా సౌకర్యాన్ని పునరుద్ధరిస్తున్నారు. ఎర్నాకులం, కొట్టాయం, పాల్గాట్, కోళికోడ్, కన్నూరు, త్రివేండ్రానికి కర్నాటక ఆర్టీసీ తమ సర్వీసులను తిరిగి ప్రారంభించింది. కొచ్చి విమానశ్రయంలో ఇంకా నీరు నిల్చి ఉండటంతో నేవీ బేస్ ద్వారా కమర్షియల్ ఫ్లైట్లను నడిపే అవకాశాలను పరిశీలిస్తున్నారు. సోమవారానికి వాతావరణ పరిస్థితుల్లో కాస్త మార్పు రావచ్చని ఐఎండీ ఆశాభావం వ్యక్తం చేస్తుండటంతో…సహాయక చర్యలు మరింత ముమ్మరం అయ్యే అవకాశాలున్నాయి.