భారత్‌ను అణుశక్తి దేశంగా రూపొందించిన ఘనత వాజ్ పేయిదే-మోడీ

మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి సిద్ధాంతాలతో ఎప్పుడూ రాజీపడ లేదని ప్రధాని మోడీ కొనియాడారు. ఢిల్లీ ఇందిరాగాంధీ ఇండోర్ స్టేడియంలో వాజ్‌పేయి సంతాప సభలో పాల్గొన్న ఆయన… భారత్‌ను అణుశక్తి దేశంగా రూపొందించిన ఘనత ఆయనదేనన్నారు. కాశ్మీర్ అంశంపై ఇండియాను ఎవరూ ఇరకాటంలో పెట్టేందుకు వీలులేని విధంగా భారత వైఖరిని, వాస్తవాలను సమర్ధవంతంగా బయట ప్రపంచానికి వాజ్‌పేయి చాటిచెప్పారని మోడీ కితాబిచ్చారు. ఉత్తమ పార్లమెంటేరియన్‌గా పార్లమెంటరీ సంప్రదాయాలకు గౌరవం తెచ్చిపెట్టిన ఖ్యాతి ఆయనకే దక్కుతుందన్నారు. ప్రధానిగా ఉన్నప్పుడు వాజ్‌పేయి ఏర్పాటు చేసిన మూడు రాష్ట్రాలు అభ్యుదయపథంలో పయనిస్తున్నాయని, ఎలాంటి చిక్కులు లేకుండా శాంతియుతంగా రాష్ట్రాల ఏర్పాటు ప్రక్రియ జరిగిందని గుర్తు చేశారు.

అటల్ జీ తో తనకు 65 ఏళ్ల స్నేహ బంధముందని బీజేపీ సీనియర్ నేత అద్వానీ చెప్పారు. ఆయనతో కలిసి చేయడం, ఎన్నో అనుభవాలను పంచుకోవడాన్ని అదృష్టంగా భావిస్తున్నానన్నారు. వాజ్ పేయి మార్గం అనుసరణీయమని తెలిపారు.

వాజ్‌పేయితో ఉన్న అనుబంధాన్ని ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్‌తో పాటు కాంగ్రెస్ నేత గులాంనబీ ఆజాద్‌ గుర్తు చేసుకున్నారు.