కేరళ విలయానికి కారణం అదే కాదు.. ఆ దోపిడీ కూడా..

cause of kerala floods

నైరుతి రుతుపవనాలు, అల్పపీడనాలు మాత్రమే కాదు.. సహజన వనరుల దోపిడీ కూడా కేరళలో పెను ఉత్పాతానికి కారణం..కేరళను కన్నీళ్లు పెట్టించింది.. లక్షల మంది నిరాశ్రయులను చేసింది.. ఊళ్లను, ఏర్లను ఏకం చేసింది ఈ చర్యలే..గత వందేళ్లలో ఎన్నడూ లేని ప్రళయాన్ని కేరళ చవిచూస్తోంది. వరుణుడి ధాటికి వందల మంది చనిపోయారు.ముందు జాగ్రత్తలు తీసుకోవాలని ఏడేళ్ల కిందటే పర్యావరణ వేత్త మాధవ్‌ గాడ్గిల్‌ సూచించారు. కానీ, ఎవరూ ఆయన సూచనను పరిగణలోకి తీసుకోలేదు.. ఫలితమే కేరళలో ఈ పరిస్థితి.

ఇప్పుడు గాడ్గిల్‌ మరో హెచ్చరిక చేశారు.. పర్యావరణ పరంగా తగిన చర్యలు తీసుకోకుంటే కేరళలో తలెత్తిన పరిస్థితే గోవాలోనూ రిపీట్‌ అవుతుందని స్పష్టం చేశారు. కొన్నేళ్ల కిందట పశ్చిమ కనుమలపై గాడ్గిల్‌ నేతృత్వంలో కమిటీ అధ్యయనం చేసింది.. ఈ సర్వే సారాంశంపై విస్తృతంగా చర్చ జరిగింది. అప్పుడే కేరళ ముప్పును ఆయన అంచనా వేశారు. ఏడేళ్ల తర్వాత గాడ్గిల్‌ అంచనా నిజమైంది.

పశ్చిమ కనుమలను ఆనుకుని ఉన్న ప్రాంతాలపై పర్యావరణ పరంగా సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. అయితే, కేరళలో ఉన్నట్టుగా అంత ఎత్తున పశ్చిమ కనుమలు గోవాలో లేకపోయినప్పటికీ.. ఈ తరహా ఉత్పాతాలు తప్పవని గాడ్గిల్‌ పేర్కొన్నారు. 2011లోనే గోవాలో జరుగుతున్న ఐరన్‌ ఓర్‌ మైనింగ్‌ కంపెనీల నుంచి సేకరించిన డాటా ఆధారంగా ఇక్కడి పర్యావరణంపై అధ్యయనం చేశారు. ఆ సంస్థలు తప్పుడు నివేదికలు ఇచ్చాయని అప్పుడే గాడ్గిల్‌ విమర్శించారు. అంతులేని లాభాపేక్ష కారణంగానే ఎవరూ పర్యావరణంపై దృష్టిపెట్టడం లేదని గాడ్గిల్‌ అంటున్నారు. పర్యావరణాన్ని కాపాడేందుకు చేపట్టాల్సిన చర్యలను ప్రభుత్వాలు సరిగా పట్టించుకోవడం లేదన్నారు. గోవాలో అక్రమ మైనింగ్‌ ద్వారా 35వేల కోట్లు ఆక్రమంగా ఆర్జించినట్లు కేంద్రం నియమించిన జస్టిస్‌ ఎంబీ షా కమిషన్‌ తేల్చిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు.

మరి, ఇప్పటికైనా ప్రభుత్వాలు మేల్కొంటాయా..? పర్యావరణ నిబంధనల అమలుపై దృష్టిపెడతాయా..? పర్యావరణ పరిరక్షణ చర్యలను మొదలు పెడతాయా..? గాడ్గిల్‌ తాజా హెచ్చరికతో గోవా ప్రభుత్వం ఏం చేయబోతోందన్నదే ఆసక్తికరంగా మారింది.

- ఉచితంగా మీ జాతకాన్ని తెలుసుకోండి -