గుండెల్లో గుబులు పుట్టిస్తున్న గోదావరి

గుండెల్లో గోదావరి గుబులు పుట్టిస్తోంది.. గలగలా పారుతూ పరవళ్లు తొక్కే.. గోదారమ్మ ఇప్పుడు ఉగ్రరూపం దాల్చింది. తూర్పు గోదావరి జిల్లా వ్యాప్తంగా ఎడతెరిపిలేని వర్షాలకు తోడు.. ఎగువ ప్రాంతాల నుంచి వరద పోటెత్తుతోంది. దీంతో గోదావరిలో వరద ఉధృతి హోరెత్తిస్తోంది. లంక గ్రామాలు, విలీన మండలాల్లోని కొన్ని ప్రాంతాల్లో ప్రస్తుతం ముంపు పరిస్థితి కొనసాగుతోంది. మరో 48 గంటల పాటు భారీ వర్షాలు కొనసాగే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ హెచ్చరికలతో టెన్షన్‌ ఇంకాస్త పెరిగింది. ఎప్పుడు ఎటు నుంచి ప్రమాదం ముంచుకు వస్తోందో అంటూ జిల్లా ప్రజలు బిక్కు బిక్కు మంటూ బతుకుతున్నారు..

జిల్లాలో కోనసీమలోని లంక గ్రామాలు 3 రోజులుగా నీళ్లలోనే ఉన్నాయి. ముమ్మిడివరంలో వర్ష బీభత్సానికి ఏ క్షణం ఏం జరుగుతుందోనన్న టెన్షన్ కనిపిస్తోంది. ఎటు వెళ్లాలన్నా నాటు పడవలనే నమ్ముకున్న ప్రజలు ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు. గురజాపులంక దగ్గర గౌతమి గోదావరిలో నాటుపడవ తిరగబడి ఓ రైతు మరణించాడు. పాల కోసం లంకలోకి వెళ్లి తిరిగి వస్తుండగా గోదావరి సుడులు తిరుగుతుండడంతో పడవ బోల్తా పడింది. ప్రమాద సమయంలో బోటులో 20 మంది ఉన్నారు. అదృష్టవశాత్తూ 19 మంది ప్రాణాలతో బయటపడ్డారు.

ఇప్పటికే ధవళేశ్వరం దగ్గర కాటన్ బ్యారేజీకి వరద ఉధృతి పెరగడంతో.. రెండవ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. ప్రస్తుతం నీటి మట్టం 14 అడుగులకు చేరింది. బ్యారేజీ పైనుంచి వాహనాల రాకపోకలను నిలిపివేశారు. అటు, ఎగువన భారీవర్షాలతో శబరి నదికి వరద మరింత పోటెత్తింది. దీంతో..డొంకరాయి, శ్రీరామ్ సాగర్‌లో నీటి మట్టం భారీగా పెరిగింది.

అయినవిల్లిలంక, ఎదురుబిడిం, పి.గన్నవరం మండలం చాకలివారిపాలెం దగ్గర కాజ్‌వేపై నుంచి వరద నీరు ఉద్థృతంగా ప్రవహిస్తోంది. కొత్తపేట మండలంలోని వానపల్లి శివారు నారాయణలంక, సత్తెమ్మలంక, కపిలేశ్వరపురం మండలం కేదారికలంక, ఆత్రేయపురం మండలం వెలిచేరు, రాజవరం గ్రామాలకు కూడా వరద ముప్పు తీవ్రంగానే ఉంది. కోనసీమలో 11 గ్రామాలు, సీతానగరంలోని ములకల లంకతో సహా రాజమహేంద్రవరంలో పలు లోతట్టు ప్రాంతాలు జల దిగ్బంధంలోనే ఉన్నాయి.

విలీన మండలాల్లో 15 గ్రామాల ప్రజల్ని ఖాళీ చేయిస్తున్నారు. మన్యంలో వరద ముంపు ప్రభావం ఎక్కువగా ఉండే అవకాశం ఉండడంతో ప్రత్యేక బృందాల్ని సహాయ చర్యల కోసం సిద్ధంగా ఉంచారు. విలీన మండలాలతో పాటు దేవీపట్నం, అడ్డతీగల, మారేడుమిల్లి మండలాల్లోని కొన్ని గ్రామాలు జలదిగ్భందంలోనే ఉన్నాయి. దేవీపట్నం మండలం కొండమొదలులో వారం రోజులుగా రాకపోకలు నిలిచిపోవడంతో నిత్యావసర సరకుల కోసం జనం అల్లాడుతున్నారు. ప్రస్తుతం తూర్పుగోదావరి జిల్లాలో ఎనిమిది పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశారు.

జిల్లా అంతటా ఎడతెరిపి లేకుండా వానలు కురవడంతో జనజీవనం స్తంభించింది. జిల్లాలోని పలు గ్రామాల్లో రహదారులు జలమయమయ్యాయి. కొత్తపేట మండలంలోని వానపల్లి శివారు నారాయణలంక, సత్తెమ్మలంక, కపిలేశ్వరపురం మండలం కేదారిలంక, ఆత్రేయపురం మండలం వెలిచేరు, రాజవరం, వద్దిపర్రు, కట్టుంగ, ఆలమూరు మండలం బడుగువానిలంక, రావులపాలెం మండలంలోని గోపాలపురం, కొమరాజులంక, లక్ష్మీపోలవరం, పి.గన్నవరం మండలంలోని పలు గ్రామాల్లోని బొప్పాయి, అరటి, కందతో పాటు కూరగాయల పంటలు నీటమునిగాయి. మరోవైపు మెట్టప్రాంతంలోని సీతానగరం, కోరుకొండ, దేవీపట్నం, అడ్డతీగల మండలాల్లో కూడా కూరగాయల పంటలకు నష్టం వాటిల్లింది. ఇప్పటికే 1200 హెక్టార్లలో కూరగాయల పంటలు నీట మునిగినట్లు అంచనా వేస్తున్నారు.