ట్రాన్స్‌ఫర్‌ అయిన ప్రతిచోటా ఓ పెళ్లి.. మొత్తం ఎన్ని పెళ్లిళ్లంటే..

government-officer-ready-fourth-marriage-hyderabad

నలుగురికి మంచి చెప్పాల్సిన వ్యక్తే దారి తప్పాడు.. ప్రభుత్వ ఉద్యోగంలో ఉండి పాడు పనులకు తెగబడ్డాడు. ఒకరు కాదు, ఇద్దరు కాదు.. ముగ్గురు అమ్మాయిల జీవితాలతో ఆడుకున్నాడు.. నాలుగో యువతిని పెళ్లి చేసుకునేందుకు సిద్ధమయ్యాడు. హైదరాబాద్‌లో వెలుగు చూసిన ఈ నిత్య పెళ్లికొడుకు వ్యవహారం సంచనలంగా మారింది.

ఇరిగేషన్‌ శాఖలో నిత్యపెళ్లికొడుకు బాగోతం బట్టబయలైంది. బదిలీ అయిన ప్రతిసారీ ఒక్కోచోట ఒక్కొక్కరని పెళ్లి చేసుకోవడం ఆనవాయితీగా చేసుకున్నాడు శ్రీనివాస్‌. ఇప్పటికే మూడు పెళ్లిల్లు చేసుకున్న శ్రీనివాస్‌ నాలుగో వివాహానికి సిద్ధమయ్యాడు.. విషయం తెలుసుకున్న మూడో భార్య ఆందోళనకు దిగడంతో వ్యవహారం వెలుగులోకి వచ్చింది.

హైదరాబాద్‌ సరూర్‌ నగర్‌లోని భాగ్యనగర్‌ కాలనికి చెందిన శ్రీనివాస్‌ భువనగిరిలో నీటి పారుదల శాఖలో సీనియర్‌ అసిస్టెంట్‌గా పని చేస్తున్నాడు. 2014లో కామారెడ్డి జిల్లాకు చెందిన అనూష అనే మహిళను పెళ్లి చేసుకున్నాడు. 5 లక్షల నగదు, 15 తులాల బంగారు అభరణాలు కట్నంగా తీసుకున్నాడు. అయితే పెళ్లైన తరువాత రెండేళ్ల పాటు వారి కాపురం సజావుగానే సాగింది..

గతేడాది నుంచి అనూషను అత్తింటివారు వేధిచండం మొదలెట్టారు. ఆమెను ఒక నిర్మానుష గదిలో బంధించి, సంబంధం లేని కారణాలతో చిత్ర హింసలు పెడుతున్నారు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేసినా ఆమెకు న్యాయం జరగలేదు. అయితే అనూషతో పెళ్లికంటే ముందే గతంలో శ్రీనిధి, సోని అనేవారితో వివాహం జరిగిందని.. ఈ విషయం గోప్యంగా ఉంచి తమ కూతుర్ని పెళ్లాడి.. చిత్ర హింసలకు గురిచేస్తున్నాడని అనూష తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ఓ వైపు తనను చిత్ర హింసలు పెడుతూనే.. ఈ నెల 25న మరో పెళ్లికి శ్రీనివాస్‌ సిద్ధపడ్డాడడని అనూష ఆరోపిస్తోంది.

నాలుగో పెళ్లి విషయం తెలియగానే అనూష కుటుంబ సభ్యులు.. శ్రీనివాస్‌ ఇంటికి వెళ్లి నిలదీసే ప్రయత్నం చేశారు.. అయితే ఇంటి దగ్గర ఎవరూ లేకపోవడంతో.. ఇంటి ముందు అనూష బంధువులు బైఠాయించి నిరసనకు దిగారు. న్యాయం జరిగే వరకు ఆందోళన విరమించబోమన్నారు.