ఖమ్మం-రాజమండ్రి మధ్య రాకపోకలు బంద్

heavy-rain-in-west-godhavari-distric

పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. జిల్లాలో 24 గంటల్లో 27.8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. గరిష్టంగా లింగపాలెం మండలంలో 61 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. భీమడోలు, దెందులూరు, అత్తిలి, పెనుమంత్ర , ఆకివీడు, ఏలూరు, కాళ్ల, ఉండి మండలాల్లోను భారీగా వరద పోటు కనిపిస్తోంది. ఏలూరు పట్టణంలో భారీగా వరద నీరు నిలిచిపోవడంతో కాలనీల్లోని రోడ్లు చెరువుల్ని తలపిస్తున్నాయి. డ్రైనేజీ నుంచి నీరు బయటకు పోయే పరిస్థితి లేకపోవడంతో కొన్ని ఇళ్లలోకి వరద నీరు చేరింది. పోణంగి వైఎస్సార్ కాలనీకి ముంపు భయం ఉండడంతో.. అందర్నీ అక్కడి నుంచి ఖాళీ చేయిస్తున్నారు. పోలీసు, ఫైర్ సిబ్బందితో కలిసి జాయింట్ కలెక్టర్ సహాయ చర్యల్లో పాల్గొంటున్నారు.

పశ్చిమలోని ఏజెన్సీ ప్రాంతాల్లో వాగులు, వంకలు పొంగుతున్నాయి. ఎర్రకాల్వ ప్రాజెక్టు గేట్లు ఎత్తి వేయడంతో నల్లజర్ల మండలం అనంతపల్లి వద్ద వరద పంట పొలాల్ని ముంచెత్తింది. వందలాది ఎకరాలు నీట మునగడంతో రైతులు ఆందోళనలో ఉన్నారు. ఏలూరు, రాజమండ్రి జాతీయ రహదారిపై వరద నీరు చేరింది. వరద ప్రవాహం కారణంగా వాహనాల రాకపోకలకు ఆటంకం కలుగుతోంది. రెవెన్యూ, పోలీసు టీమ్‌లు సహాయ చర్యలు చేపట్టాయి.

జంగారెడ్డిగూడెం మండలంలో జల్లేరు ప్రవాహం ఉధృతంగా ఉంది. ఖమ్మం-రాజమండ్రి మధ్య రాకపోకలు బంద్ అయ్యాయి. ఆంధ్రా సరిహద్దు వద్దే పోలీసులు వాహనాలను మళ్లిస్తున్నారు. జల్లేరు వరద ప్రభావంతో బ్రిడ్జి వద్ద రోడ్డు తెగిపోవడంతో దాన్ని పునరుద్ధరించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.