కర్నాటకలో కొనసాగుతున్న వరద బీభత్సం.. 100 కోట్లు విడుదల

karnataka-floods-heavy-rains-cause-floods-landslides-in-kodagu-over-800-rescued-from-flood-hit-district

కర్నాటకలో వరద బీభత్సం కొనసాగుతోంది. రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు తగ్గుముఖం పట్టినా.. కొడగు సహా నాలుగు జిల్లాల్లో మాత్రం కుంభవృష్టి కురుస్తోంది. దీంతో వరద బాధితులను ఆదుకునేందుకు మరో 100 కోట్లు విడుదల చేస్తూ సీఎం కుమారస్వామి ఆదేశాలు జారీ చేశారు. వరద బాధిత ప్రాంతాల్లో ఏరియల్‌ సర్వే నిర్వహించిన సీఎం.. కొడగు, దక్షిణ కన్నడ, ఉత్తర కన్నడ, చిక్కమగళూరు జిల్లాలకు మరో వంద కోట్లు విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. వరద బాధిత ప్రాంతాల్లో మంత్రులు దేశ్‌పాండే, దేవేగౌడ పర్యటించారు.

రెండ్రోజులుగా వర్షం లేకపోవడంతో సహాయక చర్యలు ముమ్మరం చేశారు. హెలికాప్టర్‌ల ద్వారా సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు. ఇప్పటివరకు 3500 మందిని రక్షించారు. దక్షిణ కన్నడ, కొడగు జిల్లా సరిహద్దు ప్రాంతమైన జోడుపాళలో కొండ చరియలు విరిగిపడడంతో శిథిలాల కింద చిక్కుకుపోయిన 347 మందిని సైనికులు కాపాడారు. ఇప్పటివరకు 31 పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసి 2250 మందికి ఆహార పదార్థాలను సమకూరుస్తున్నారు. నిరంతరంగా గ్యాస్‌, పెట్రోల్‌, డీజిల్‌ను వరద ప్రాంతాలకు తరలిస్తున్నారు. గ్రామీణ ప్రాంతాలకు విద్యుత్‌, మొబైల్‌ టవర్లను పునరుద్ధరణ పనుల్ని వేగవంతం చేశారు. కొడగు జిల్లాలో 800లకు పైగా ఇళ్లు కూలినట్లు గుర్తించారు. ఇళ్లు నష్టపోయిన బాధితులకు 2 లక్షల నుంచి రెండున్నర లక్షల దాకా చెల్లించాలని ప్రభుత్వం నిర్ణయించింది. సహాయక చర్యల్లో ఎన్డీఆర్‌ఎఫ్‌, సివిల్‌ డిఫెన్స్‌, అగ్నిమాపక శాఖ, మిలిటరీ, ఎన్‌సిసి, ఎయిర్‌ఫోర్స్‌ బృందాలతో కలిపి 948 మంది విధులు నిర్వహిస్తున్నారు.

కొడగు పరిస్థితి చూస్తే ఒళ్లు జలదరిస్తోందని కేంద్రమంత్రి సదానందగౌడ విచారం వ్యక్తం చేశారు. మడికేరిలోని పలు ప్రాంతాలను ఆయన పరిశీలించారు. ఓవైపు పంటలు పూర్తిగా దెబ్బతినడం, పశువులు, పెంపుడు జంతువులు చనిపోవడంపై ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్రప్రభుత్వం నుంచి అన్ని రకాల సహాయక చర్యలు కొనసాగిస్తామని కేంద్రమంత్రి హామీ ఇచ్చారు. మడికేరిలో సైన్యంతో మాట్లాడారు. కేంద్ర రక్షణ మంత్రితో చర్చించి మరిన్ని హెలికాప్టర్‌లు, సైన్యాన్ని రంగంలోకి దింపుతామని భరోసా ఇచ్చారు.

మరోవైపు భారీ వర్షానికి చిక్‌మగళూరు సమీపంలోని యడకు మేరి రైల్వేట్రాక్‌ కొట్టుకుపోయింది. శిరాడి, సకలేశపుర ప్రాంతంలో ఇప్పటికే కొండచరియలు విరిగిపటంతోపాటు రోడ్లు, చెరువులు, కాలువలు నదులను తలపిస్తున్నాయి. ఒక భారీ బండరాయి రైల్వేట్రాక్‌ మీద పడటంతో ట్రాక్‌ పూర్తిగా దెబ్బతింది. దీంతో బెంగళూరు- మంగళూరు మధ్య రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఐదుచోట్ల కొండ విరిగిపడటంతో సహాయక చర్యలు చేపట్టేందుకు 16మంది రైల్వే కార్మికులు వెళ్లారు. అదే సమయంలో కొండచరియ విరిగిపడ్డంతో కార్మికులు అక్కడే చిక్కుకుపోయారు. దీంతో సైన్యం రంగంలోకి దిగి వారిని రక్షించింది.

- ఉచితంగా మీ జాతకాన్ని తెలుసుకోండి -