కేరళకు పొంచివున్న మరో ముప్పు

kerala-worries-about-diseases-contaminated-flood-water

పన్నెండు రోజులుగా భారీ వర్షాలు, వరదలకు కేరళ అతలాకుతలం అవుతోంది. దేశవ్యాప్తంగా కేరళను ఆదుకోవాలంటూ సోషల్ మీడియాలో పోస్టులు దర్శనమిస్తున్నాయి. ఎవరికీ తోచిన సాయం వారు చేస్తూనే ఉన్నారు. ఇప్పటికే సర్వం కోల్పోయిన కొందరు కేరళ ప్రజలకు మరో ముప్పు పొంచి ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. వరద తాకిడి క్రమంగా తగ్గుతున్న నేపథ్యంలో అక్కడ అంటువ్యాధులు విజృంభించే అవకాశం ఉందని.. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, ఆసుపత్రుల్లో ఉన్న మందులు నీళ్లలో కొట్టుకుపోయిన నేపథ్యంలో అంటువ్యాధులు ప్రబలితే నిలువరించడం చాలా కష్టమవుతుందని అంటున్నారు. దీంతో కొన్ని రోజులపాటు కలుషిత ఆహరం, నీరు తీసుకోకుండా ఉండాలని అభిప్రాయపడుతున్నారు. ఒకవేళ సరైన జాగ్రత్తలు తీసుకోకుంటే కలరా, డయేరియా, టైఫాయిడ్‌ వంటి వ్యాధులు ప్రబలే అవకాశముందని తద్వారా తీవ్ర నష్టం వాటిల్లుతుందని నిపుణులు చెబుతున్నారు. గతవారం రోజులుగా కేరళ ప్రజలు చికున్‌గన్యా, డెంగ్యూ, మలేరియా వాధులతో అల్లాడుతున్నారు. వారికీ చికిత్స అందించడంకోసం పలు ప్రాంతాల్లో వైద్యశిబిరాలు వెలిశాయి. ఇదిలావుంటే తమ రాష్ట్రానికి అత్యవసర మందుల్ని అందించి ఆదుకోవాలని కేంద్ర ఆరోగ్య శాఖకు, ప్రైవేటు ఆసుపత్రులకు కేరళ ప్రభుత్వం లేఖ రాసింది.