పూజల పేరుతో ఇంటికి వచ్చి.. మహిళను తీసుకుని పరార్

mother-and-baby-kidnap-kurnool
చిన్న కూతురు సంజనతో లక్ష్మిదేవి(ఫైల్‌ )

కర్నూలు జిల్లాలో బురిడీ బాబా మోసం బయటపడింది. డోన్ పట్టణంలోని కొండపేటకు చెందిన శ్రీనివాసులును పూజలు, మంత్రాల పేరుతో నమ్మించి మోసం చేశాడు. అతనిలో చనువుగా ఉంటూనే భార్యపై కన్నేశాడు. మహిళకు మాయమాటలు చెప్పి ఆమె తోపాటు మూడేళ్ల చిన్నారిని తీసుకుని పరారయ్యాడు. ఆటో నడుపుతూ జీవనం సాగించే శ్రీనివాసులుకు భార్య లక్ష్మిదేవి, ఇద్దరు కూతుళ్లున్నారు. గతకొంత కాలంగా కుటుంబ సమస్యల్లో ఉన్న వీరికి ఉప్పలపాడుకు చెందిన బురిడీ బాబా రంగస్వామి పరిచమయ్యాడు. ఇంట్లో శని ఉందని, అందువల్లే కీడు జరుగుతోందని శ్రీనును నమ్మించాడు. ముందు కీడు తొలగిస్తే మంచి జరుగుతుందని, కొన్నిరోజుల పాటు పూజలు చేయాలని అతనికి సూచించాడు రంగస్వామి.

ఈ క్రమంలో ప్రతి రోజు ఇంటికి వచ్చి పూజలు చేసేవాడు. ఇలా 20 రోజులయ్యే సరికి తన భార్య అతని మాయలో పడిందని శ్రీనివాసులు తెలిపాడు. అయితే అతడు సూచించిన స్థలానికి వెళ్లి రావాలని చెప్పగా శనివారం మధ్యాహ్నం వెళ్లానని, తిరిగి ఇంటికి వచ్చే సరికి భార్య లక్ష్మిదేవి, చిన్న కూతురు సంజన(4)ను బైక్ పై ఎక్కించుకుని వెళ్ళిపోయినట్టు ఇరుగుపొరుగు వారు చెప్పినట్టు శ్రీనివాసులు తెలిపాడు. దీంతో అతనిపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు.