భర్త వేధింపులకు బలైన మహిళా కానిస్టేబుల్

మధురేఖ (ఫైల్‌)

తరాలు మారుతున్నాయి. చట్టాలు పదునెక్కాయి. అయినాసరే కొందరు భర్తల బుద్ధిమాత్రం మారడం లేదు. భార్య ఉద్యోగం చేస్తున్నాసరే అత్యాశకు పోతున్నారు. కట్నం కోసం వేధిస్తున్నారు. భార్య పోలీసు ఉద్యోగం చేస్తున్నా చట్టం గురించి భయపడడం లేదు. ఆత్మహత్య చేసుకున్న ఓ లేడీ కానిస్టుబుల్ ఘటనే ఇందుకు ఉదాహరణ. పెళ్లయిన మూడు నెలలకే ఆమె సూసైడ్ చేసుకోవడం కలకలం రేపింది.

లేడీ కానిస్టేబుల్ లావుడ్యా మధురేఖ ఆత్మహత్య కలకలం రేపింది. తన క్వార్టర్‌లోనే పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంది. మధురేఖ నిర్మల్ జిల్లా కడెం పోలీస్ స్టేషన్‌లో కానిస్టేబుల్…

మధురేఖ బలవన్మరణానికి పాల్పడేంతటి పిరికిది కాదు. జన్నారం మండలం కలమడుగుకు చెందిన మధురేఖ ధైర్యసాహసాలున్న యువతి. అందుకే పోలీసు డిపార్ట్‌మెంట్‌లో కానిస్టేబుల్‌గా ఉద్యోగం సంపాదించింది. ఉద్యోగంలో ఎలాంటి ప్రాబ్లం లేదు. కానీ పెళ్లి చేసుకోవడమే ఆమె పాలిట శాపంగా మారింది. మూడు నెలల క్రితమే ఆమెకు పెంబి మండలానికి చెందిన గుగ్లావత్ శ్రీనివాస్‌తో వివాహమైంది. ఆ తర్వాత కొన్ని రోజులకే భార్యాభర్తల మధ్య అదనపుకట్నం విషయంలో గొడవలు మొదలయ్యాయని కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు.

లక్షెట్టిపేట స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా పనిచేసిన మధురేఖ నెలన్నర క్రితమే బదిలీపై కడెం స్టేషన్‌కు వచ్చింది. ఇక్కడి క్వార్ట్‌లో ఉంటోంది. ఆదివారం మధ్యాహ్నం వరకు కూడా ఆమె డ్యూటీకి రాకపోవడంతో ఆమె ఇంటికి వెళ్లి చూసిన హోంగార్డు షాకైంది. అప్పటికే ఆమె నురగలు కక్కుతూ కిందపడిపోయింది. పక్కనే పురుగుల మందు డబ్బా ఉంది. అపస్మారక స్థితిలోకి వెళ్లిన ఆమెను వెంటనే హాస్పిటల్‌కు తరలించారు పోలీసులు. కానీ అప్పటికే మధురేఖ ప్రాణాలు కోల్పోయినట్లు డాక్టర్లు ప్రకటించారు.

మధురేఖ తండ్రి లాకవత్‌ మధున్‌ నాయక్‌ ఉట్నూర్‌ డిపోలో ఆర్టీసీ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. కూతురు మరణవార్త విని అతడు తల్లిడిల్లిపోయాడు. అల్లుడి వరకట్న వేధింపులు భరించలేకనే తమ కూతురు ఆత్మహత్య చేసుకున్నట్లు కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు మొదలు పెట్టారు. మధురేఖ భర్త కోసం గాలిస్తున్నారు.