అమరావతి బాండ్లు లాభమా నష్టమా..?

amaravathi bonds doughts claify planing commision vice chairmen kutumbarao

అమరావతి బాండ్లు లాభమా నష్టమా..? అప్పులతో గొప్పలెందుకంటూ విపక్షాలు తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నాయి.. ఈ నేపథ్యంలో ప్రభుత్వం స్పందించింది.. దీనిపై రాష్ట్ర ప్రణాళికా మండలి ఉపాధ్యక్షుడు కుటుంబరావు వివరణ ఇచ్చారు. బాండ్ల వడ్డీ రేట్లపై అపోహలు వద్దని ప్రజలకు చెప్పారు.

ప్రభుత్వం ఏ కార్యక్రమం చేపట్టినా విపక్షాలు విమర్శించడం సహజం. అమరావతి బాండ్ల విషయంలోనూ ఇదే జరుగుతోంది.. అమరావతి నిర్మాణం కోసం ప్రభుత్వం బాండ్లను జారీ చేసింది.. దీనికి ఊహించని స్పందన వచ్చింది.. బాంబే స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌లో ఒకటిన్నర రెట్లు ఓవర్‌ సబ్‌ స్క్రైబ్‌ అయ్యాయి.. ఈ బాండ్లపై ప్రభుత్వం 10.32 శాతం వడ్డీ ఇస్తోంది.. ఇంత వడ్డీ ఇవ్వడాన్ని విపక్షాలు తప్పుపడుతున్నాయి.. బాండ్లంటేనే అప్పులని.. అప్పులు తెచ్చుకోవడం కూడా గొప్పేనా అంటూ విమర్శలు గుప్పిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం స్పందించింది.. ఈ వివాదానికి ఫుల్‌ స్టాప్‌ పెట్టేందుకు రాష్ట్ర ప్రణాళికా మండలి ఉపాధ్యక్షుడు కుటుంబరావు మీడియా ముందుకొచ్చారు. అమరావతి బాండ్ల వడ్డీ రేట్లపై అపోహలు వద్దన్నారు. నిర్మాణ పనులు ఆగకుండా ముందుకు సాగాలంటే వివిధ మార్గాల్లో నిధుల సమీకరణ అవసరమన్నారు. ఈ నిధుల కోసమే సీఆర్డీయే బాండ్లు జారీ చేసిందని చెప్పారు.

అమరావతి బాండ్లపై ప్రతిపక్షాలు, మాజీ సీఎస్‌ ప్రజల్లో అపోహలు సృష్టించాలని చూస్తున్నారని కుటుంబరావు అన్నారు. బాండ్ల ద్వారా అప్పు చేస్తున్నామని ముందే చెప్పామని గుర్తుచేశారు. సీఆర్‌డీఎ కొత్తగా పుట్టిన అథారిటీ కాబట్టి వడ్డీ రేటు కాస్త ఎక్కువగా ఉందని వివరణ ఇచ్చారు. అయినా ప్రస్తుతం ఉన్న వడ్డీ రేటు ప్రకారమే బాండ్లను జారీ చేశామన్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్న క్రెడిబుల్టీతోనే బ్రాండ్‌లకు క్రేజ్‌ వచ్చిందని కుటుంబరావు స్పష్టంచేశారు.బాండ్లను విమర్శించే వారు ఏ విధంగా రాష్ట్రం తప్పు చేసిందో చెప్పాలని కుటుంబరావు సూచించారు. ఇంత కంటే తక్కువ వడ్డీ రేటుకు ఎవరైనా వస్తే ఆరెంజ్‌ ఫీ మినహాయింపు ఇస్తామని చెప్పారు.