కేరళ వరద బాధితులకు ఏపీఎన్జీవోలు 20 కోట్లు విరాళం

apnvovo-has-donated-20-crores-to-kerala-flood-victims

వరద విలయం నుంచి కేరళ రాష్ట్రం ఇప్పుడిప్పుడే కోలుకుంటోంది. లోతట్టు ప్రాంతాలు మినహా మిగిలిన చోట్ల క్రమంగా సాధారణ పరిస్థితులు నెలకొంటున్నాయి. విద్యుత్, కమ్యూనికేషన్ వ్యవస్థలను యుద్ధప్రాతిపదికన పునరుద్దరిస్తున్నారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో ఎన్డీఆర్ఎఫ్ బృందాలతో పాటు.. త్రివిధ దళాలు ముమ్మర సేవలందిస్తున్నాయి.

వరదలు తీవ్ర ప్రభావం చూపిన జిల్లాలు సహా ఇతర ప్రాంతాల్లో చిక్కుకున్న వారిని రక్షించేందుకు భద్రతబలగాలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. ఉధృతంగా ప్రవహిస్తున్న వరదలో.. తాళ్ల సాయంతో.. అనేక మందిని నేవీ సిబ్బంది వీరోచితంగా కాపాడారు. రోడ్డు మార్గం దెబ్బతిన్న చోట ఆర్పీఎఫ్ సిబ్బంది ప్రతికూల పరిస్థితుల్లోనూ.. తాత్కాలిక వంతెనలు నిర్మించారు. వరద నీటిలో చిక్కుకున్న వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు.

ప్రకృతి బీభత్సానికి సుమారు 400మంది ప్రాణాలు కోల్పోయారు. వేలాది మంది నిరాశ్రయులయ్యారు. సుమారు 10లక్షలమంది పునరావాసాల్లో రక్షణ పొందుతున్నారు. వరద నీరు తగ్గడంతో.. లోతట్టు ప్రాంతాల్లో మానవ, జంతు కళేబరాలు బయటపడుతున్నాయి. మరికొన్ని చోట్ల పాములు, విషసర్పాలు ఇళ్లలోకి చేరుతుండటంతో.. జనం అష్టకష్టాలు పడుతున్నారు.

సహాయకచర్యలు, పునరావాసం, వైద్య సదుపాయాలపై దృష్టి పెట్టాలని అధికారులకు సీఎం పినరయి విజయన్ సూచించారు. అంటురోగాలు ప్రబలకుండా తగిన చర్యలు తీసుకోవాలని, వైద్యశాఖ అధికారులను ఆదేశించారు. సహాయక చర్యలు కొనసాగుతున్నా అవి వరద బాధితులకు పూర్తిస్థాయిలో అందడంలేదు. వరద నీరు తగ్గడంతో.. ఇన్ని రోజులు ఇళ్లలోనే బిక్కుబిక్కు మంటూ బతికిన జనం.. బతుకు జీవుడా అంటూ బాహ్యప్రపంచంలోకి అడుగు పెడుతున్నారు. నిత్యావసరాలు దొరక్క తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో పరిస్థితి మరింత దయానీయంగా మారింది. నిత్యవసరాల ధరలు చుక్కలనంటుతున్నాయి. పిడికెలు మెతుకుల కోసం ఆరాటపడుతున్న వరద బాధిత ప్రజలను కొందరు నిలువు దోపిడీ చేస్తున్నారు.

పెరియార్ డ్యామ్‌కు వరద కొనసాగుతుండడంతో దిగువనున్న ప్రాంతాలు ఇంకా జలదిగ్బంధం నుంచి బయట పడలేదు. పర్వత ప్రాంతమైన ఇదుక్కి జిల్లా, మలప్పురం, త్రిస్సూర్‌లలో మాత్రం పరిస్థితి ఇంకా దారుణంగానే ఉంది. బస్సు, రైలు సర్వీసులను పునరుద్ధరించినా… అవి ఎర్నాకుళం, కొట్టాయం, పాల్గాట్, కాలికట్, తిరువనంతపురం ప్రాంతాల్లో మాత్రమే సేవలు అందిస్తున్నాయి. వరదలతో కొచ్చి విమానాశ్రయం ఈనెల 26వరకు మూసివేయగా.. అక్కడి నేవీ విమానాశ్రయం విమానాలను నడుతున్నారు.

మరోవైపు కేరళకు విరాళాలు వెల్లువెత్తుతున్నాయి. దేశ నలుమూల నుంచి విరాళాలు, వస్తువులను దాతలు కేరళకు చేరుస్తున్నారు. ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు నెల జీతాన్ని విరాళంగా ప్రకటించారు.. శివసేన ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు నెల వేతనాన్ని ఇస్తున్నట్లు తెలిపారు. ఏపీఎన్జీవోలు 20 కోట్ల రూపాయలను విరాళంగా ఇచ్చారు. సినీ ప్రముఖులు, రాజకీయ ప్రముఖులు పెద్ద ఎత్తున విరాళాలు ఇస్తున్నారు. కేరళలో విద్యుత్‌ పునరుద్ధరణ పనుల కోసం ఏపీ ప్రభుత్వం ప్రత్యేక బృందాన్ని పంపించింది. యూఏఈలో ఉన్న భారత సంతతికి చెందిన వ్యాపార వేత్తలు కేరళ బాధితులకు 17 కోట్ల రూపాయలు విరాళం అందించారు.