ఆసియా క్రీడల్లో భారత షూటర్ల హవా

ఇండోనేషియా వేదికగా జరుగుతోన్న ఆసియా క్రీడల్లో భారత షూటర్లు తమ హవా కొనసాగిస్తున్నారు. పురుషుల 10మీటర్ల ఎయిర్‌ రైఫిల్‌ విభాగంలో ఇద్దరు భారతీయులు పతకాలు దక్కించుకున్నారు. 16 ఏళ్ల సౌరభ్‌ చౌదరి భారత్‌కు షూటింగ్‌లో తొలి స్వర్ణాన్ని అందించాడు. మరో షూటర్‌ అభిషేక్‌ వర్మ కాంస్యంతో సరిపెట్టుకున్నాడు. 240.7 పాయింట్లతో సౌరభ్‌ అగ్రస్థానంలో నిలవగా జపాన్‌కు చెందిన టొమోయుకి మసుడా రజతం దక్కించుకున్నాడు. 219.3 పాయింట్లతో అభిషేక్‌ మూడో స్థానంలో నిలిచాడు. సౌరభ్‌ ఆసియా గేమ్స్‌లో అత్యధిక పాయింట్లతో రికార్డు కూడా నెలకొల్పాడు. దీంతో ఇప్పటి వరకు ఆసియా క్రీడల్లో భారత్‌ పతకాల సంఖ్య 7కు చేరింది. ఇందులో 3 స్వర్ణాలు, 2 రజతాలు, 2 కాంస్యాలు ఉన్నాయి. ఒక్క షూటింగ్‌లోనే భారత్‌ 5 పతకాలు గెలవడం విశేషం.

ఆసియా క్రీడల్లో భారత్‌ మొట్టమొదటి సెపక్‌తక్రా పతకాన్ని తన ఖాతాలో వేసుకుంది. గ్రూప్‌-బిలో ఉన్న భారత సెమీఫైనల్లో భాగంగా థాయ్‌లాండ్‌తో తలపడింది. ఈ మ్యాచ్‌లో భారత్‌ 0-2తో ఓడిపోయింది. దీంతో భారత్ కాంస్యంతో సరిపెట్టుకోవల్సి వచ్చింది. సెపక్‌తక్రాలో భారత్‌కు ఇదే తొలి పతకం. ఈ పోటీల్లో సెమీఫైనల్‌ చేరిన జట్లకు కాంస్యం ఖాయమవుతుంది. సెపక్‌తక్రా వాలీబాల్‌ తరహాలో ఉంటుంది. ఆసియా క్రీడల్లో ఇప్పటి వరకు భారత్ ఖాతాలో 10 పతకాలు చేరాయి. ఇందులో 3 స్వర్ణాలు, 3 రజతాలు, 4 కాంస్యాలు ఉన్నాయి.