అనూహ్య మలుపులు తిరుగుతున్న చంద్రగిరి రాజకీయాలు

chandragiri-political-situation-today

చంద్రగిరి రాజకీయాలు అనూహ్య మలుపులు తిరుగుతున్నాయి. గత ఎన్నికల్లో విజయం సాధించిన వైసీపీ సీనియర్ నాయకుడు చెవిరెడ్డి భాస్కర రెడ్డి మళ్లీ గెలవాలని పట్టుదలగా ఉన్నారు. అటు గతంలో తమ కంచుకోట అయిన చంద్రగిరి కోటపై పసుపు జెండా ఎగరేయాలని చూస్తోంది. దీంతో ఎన్నికలకు ఇంకా సమయం ఉండగానే.. ఎవరికి వారు ఓటర్లను ప్రసన్నం చేసుకునేపనిలో పడ్డారు. డబ్బు రాజకీయాలకు తెరతీశారు. ఇటీవల కొంత మంది మహిళా సంఘాల సభ్యుల వ్యక్తిగత ఖాతాల్లోకి డబ్బులు రావడం రాజకీయంగా ప్రకంపనలు సృష్టించింది. ఇది ఇరు పార్టీల మధ్య ఘర్షణకు దారి తీసింది.

నియోజకవర్గంలో చంద్రగిరి, రామచంద్రాపురం, పాకాల, చిన్నగోట్టిగల్లు, తిరుపతి రూరల్ మండలాలున్నాయి. ఇక్కడ మొత్తం డ్వాక్రా సంఘాలకు కలిపి 210 సంఘమిత్రలు ఉన్నారు. ఇందులో 175 మంది సంఘమిత్రుల వ్యక్తిగత ఖాతాల్లోకి 2వేల చొప్పున నగదు జమ అయింది. ఇది కూడా స్థానిక ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డి సతీమణి లక్ష్మికాంత అకౌంట్ నుంచి డిపాజిట్ అయ్యాయి. ఇది స్థానికంగా కలకలం రేపింది. దీనిపై టీడీపీ నాయకులు దృష్టిపెట్టారు. సంఘమిత్రల డబ్బులు ఇవ్వడం వెనక ఉద్దేశం ఎంటని నిలదీశారు. రాజకీయంగా చర్చనీయాంశం కావడంతో సంఘమిత్రులు సమావేశం అయ్యారు. తమకు ప్రభుత్వం తమసేవలకు గుర్తింపుగా వేతనం అడుగుతున్నామని.. వ్యక్తిగత ఖాతాల్లో ఇలా వ్యక్తుల నుంచి కోరుకోవడం లేదన్నారు. డబ్బులు ఎమ్మెల్యే కుటుంబానికి వెనక్కు ఇస్తామని ప్రకటించారు. సమావేశం పెట్టుకున్న ప్రాంతానికి వైసీపీ, టీడీపీ నాయకులు వచ్చి హడావిడి చేయడంతో గందరగోళం నెలకొంది. అయితే ఎమ్మెల్యే వర్గం మాత్రం దీనిని సమర్ధించుకుంటున్నారు. సంఘమిత్రులు పనులు మానుకుని కష్టపడుతున్నారని.. తమను ప్రభుత్వం ఆదుకోవడం లేదని తనవద్దకు వచ్చి వాపోయారని.. దీంతో మానవత్వంతో స్పందించిన నెలకు 2వేల చొప్పున ఆర్ధిక సాయం చేయాలని భావించినట్టు చెవిరెడ్డి చెబుతున్నారు. తనకు నెలకు నాలుగు లక్షలు ఖర్చు అయినా.. సంఘమిత్రలు సంతోషంగా ఉండాలని తన సతీమణి అకౌంట్ నుంచి డబ్బులు జమచేసినట్టు చెబుతున్నారు.

అయితే ఎమ్మెల్యే వాదనపై టీడీపీ వర్గాలు మండిపడుతున్నాయి. ఎన్నికలు సమీపిస్తుండడంతో ఓటర్లను కొనుగోలు చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. వ్యక్తిగతంగా సంఘమిత్రులకు డబ్బులు ఎలా ఇస్తారని… వారిని ఆదుకోవడానికి ప్రభుత్వం ముందుకొచ్చిందని అంటున్నారు. నెలకు 3వేల చొప్పున గౌరవ వేతనం ఇస్తామని సీఎం చంద్రబాబు ప్రకటించినట్టు చెబుతున్నారు. ఇది ముమ్మాటీకి ఓటుకు నోటేనని అంటున్నారు. అందుకే సంఘమిత్రులు డబ్బులు వెనక్కు ఇచ్చినట్టు గుర్తుచేస్తున్నారు. మొత్తానికి చంద్రగిరిలో డబ్బు రాజకీయం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

- ఉచితంగా మీ జాతకాన్ని తెలుసుకోండి -