డెలివరీ చేస్తుండగా మధ్యలో ఆకలై.. వీడియో

కళ్లముందు బోలెడు పదార్థాలు నోరూరిస్తున్నా తినలేని పరిస్థితి రెస్టారెంట్లలో పనిచేసే వర్కర్లది. కస్టమర్లు ఆర్డరిచ్చిన ఫుడ్‌ని డెలివరీ చేసే బాయ్‌లు సైతం కడుపులో ఎలకలు పరిగెడుతున్నా డ్యూటీ చేయాల్సిందే. చైనాకు చెందిన ఓ డెలివరీ బాయ్‌కి పాపం బాగా ఆకలేసినట్లుంది. తను డెలివరీ చేస్తున్న ప్యాకెట్లోని ఐటెం నోరూరించిందేమో.. అంతే ఆలస్యం చేయకుండా లిప్ట్‌లో నుంచి కిందికి దిగేలోపు ఎంచక్కా ప్యాకెట్ ఓపెన్ చేసి సగం పదార్థాలు తినేశాడు. మళ్లీ యధావిధిగా ప్యాక్ చేసి కస్టమర్‌కి డెలివరీ చేసేసాడు. తను చేసిన పని ఎవరూ చూడట్లేదనుకున్నాడు కానీ సీసీ కెమేరాకు చిక్కాడు. అతడి నిర్వాకాన్ని చూసిన రెస్టారెంట్ యాజమాన్యం పనిష్మెంట్ ఇచ్చింది.

ఇప్పడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కొందరు డెలివరీ బాయ్ చేసింది తప్పుకాదంటే.. మరొకరు ఆన్‌లైన్‌లో ఫుడ్ ఆర్డర్ చేయకండంటూ రకరకాలుగా స్పందిస్తున్నారు. ఇప్పుడిది చూస్తుంటే ఇంతకు ముందు చైనాలోనే జరిగిన మరో సంఘటన గుర్తుకు రాక మానదు. కస్టమర్ సూప్‌ని ఆర్డర్ చేస్తే డెలివరీ బాయ్ మొత్తం తాగేసి సూప్ స్థానంలో సుస్సూ నింపి ఇచ్చాడు. అప్పుడది కూడా వైరల్ అయ్యింది.