‘ఐ యామ్ వెరీ సారీ’.. ప్రియురాలి కోసం 300..

అమ్మాయికి అలక అందమే.. ప్రేమించిన ప్రియుడిపై ప్రియురాలు అలిగితే ఆ అలక తీర్చడం కోసం నానా తంటాలు పడతాడు ప్రియుడు. ఎరుపెక్కిన చెక్కిళ్లపై చిన్న ముద్దుతో అలక తీరిపోతుందా అంటే ఓ ఎస్.. నేను రెడీ అంటాడు. కానీ ఇక్కడ అలిగిన ప్రియురాలు వేరే ఊర్లో ఉంది. మహారాష్ట్ర పూణేకు చెందిన నీలేశ్ ఖేడేకర్ అనే వ్యాపార వేత్త కొడుకు ముంబైకి చెందిన ఓ అమ్మాయితో ప్రేమలో పడ్డాడు.

ఇద్దరి మధ్యా చిన్న గొడవ జరిగినట్టుంది. ఆమె అలిగింది. నీతో మాట్లాడను అంటూ మూతి ముడుచుకుంది. ఎన్ని సార్లు ఫోన్ చేసినా లిప్ట్ చేయట్లేదు. అలక తీర్చడం కోసం ఏం చేయాలా అని ఆలోచిస్తున్నాడు. ఇంతలో ఆమె ముంబై నుంచి పూణే వస్తుందని తెలుసుకున్నాడు. ప్రియురాలి అలక తీర్చడం కోసం వినూత్నంగా ఆలోచించాడు. బస్ వచ్చే రూట్లో దారి పొడవునా ‘ఐయామ్ సారీ’ అంటూ బ్యానర్లను కట్టించాడు. మొత్తం 300 బ్యానర్లను దారికి అటూ ఇటూ కట్టించాడు.

అసలే ట్రాఫిక్ జామ్‌ని అరికట్టలేక పోలీసులకు తల ప్రాణం తోకకి వస్తుంటే.. మధ్యలో ఈ బ్యానర్లేంటని ఆరా తీసిన పోలీసులకు విషయం తెలిసింది. అనుమతుల్లేకుండా బ్యానర్లు కట్టినందుకు పోలీసులు అతడిపై కేసు నమోదు చేసి, జరిమానా విధించారు. మరి తన కోసం ఇంత చేసిన ప్రియుడిని క్షమించిందో లేదో.