మహిళా ఎస్పీపై ఐజీ లైంగిక వేధింపులు

మగాడు.. ఎక్కడైనా మగాడే.. పేరుకి పెద్ద పదవులు.. కానీ చేసేవన్నీ పాడు పనులు.. ఆడది కనిపిస్తే ఆబగా చూస్తుంటారు. స్థాయిని మరచిపోయి చీప్‌గా ప్రవర్తిస్తుంటారు. తమిళనాడుకు చెందిన ఓ మహిళా ఎస్పీపై ఐజీ లైంగిక వేధింపులకు పాల్పడ్డారు. గ్రేటర్ చెన్నై పోలీస్ శాఖలో డిప్యూటీ కమిషనర్‌గా బాధిత మహిళ పని చేస్తున్నారు.

ఏడు నెలల క్రితం తన పనిని మెచ్చుకునే సాకుతో ఐజీ తనను కౌగిలించుకునే ప్రయత్నం చేస్తే తాను ప్రతిఘటించినట్లు చెప్పారు. ఏదైనా కేసుకు సంబంధించిన సమాచారం గురించి మాట్లాడడానికి వెళితే అతడి సెల్‌ఫోన్‌లో అశ్లీల దృశ్యాలు చూపించేవారన్నారు. వాటిని తన సెల్‌కి కూడా పంపించేవారన్నారు. తనని ఎన్ని ఇబ్బందులకు గురిచేసినా అతడికి లొంగలేదని తెలియజేసారు. దీంతో ఏసీఆర్‌లో తనకు వ్యతిరేకంగా రాస్తానని బెదిరించారని తెలిపారు.

తెల్లవారు జామునుంచే అసభ్యకర సందేశాలు పంపిస్తూ ఫోన్ చేసేవారని ఆరోపించారు. పోలీసు శాఖలో సమర్ధుడిగా పేరున్న ఐజీపై ఫిర్యాదు చేస్తే ప్రభుత్వం పట్టించుకుంటుందో లేదోనని ఆందోళన చెందినట్లు ఎస్పీ తెలిపారు. రాను రాను ఐజీ వేధింపులు తాళలేక ఎస్పీ డీజీపికి ఫిర్యాదు చేశారు. ప్రభుత్వం వెంటనే స్పందించి విచారణ కమిటీ వేసింది. పని ప్రదేశంలో మహిళలపై లైంగిక వేధింపుల చట్టం కింద కేసును దర్యాప్తు చేస్తున్నారు. కేసును స్టేట్ పోలీస్ ఆఫీస్‌కు చెందిన విశాఖ కమిటీకి పంపించారు.