కేరళకు రూ.700 కోట్లు సాయం.. దుబాయ్ రాజు ఔదార్యం

పక్కవాడేమైపోయినా పట్టించుకునే రోజులు కావివి. సోషల్ మీడియా పుణ్యమా అంటూ కేరళ కష్టాన్ని తమ కష్టంగా భావిస్తూ మనసున్న మారాజులంతా స్పందిస్తున్నారు. మేమున్నామంటూ చేయూతనందిస్తున్నారు. గత 20 రోజులుగా వరదల్లో చిక్కుకున్న కేరళ రాష్ట్రం గురించి, అక్కడి ప్రజలు పడుతున్న ఇబ్బందుల గురించే ప్రపంచమంతా మాట్లాడుకుంటోంది.

దేశాధినేతలతో పాటు సెలబ్రెటీలు కూడా స్పందిస్తున్నారు తోచిన సాయం అందిస్తున్నారు. కానీ గల్ఫ్ కంట్రీ దుబాయ్ రాజుమనసు కూడా చలించింది కేరళ కష్టం చూసి. ఇక్కడి చట్టాలు కఠినంగా ఉంటాయేమో కానీ.. మేం కాదు, మా మనసులు అంతకంటే కాదు అంటూ దుబాయ్ రాజు 700 కోట్ల సాయం ప్రకటించారు.

కేరళ గురించి తెలుసుకున్న రాజు మహ్మద్ బిన్ రషీద్ ట్విట్టర్ వేదికగా స్పందించి విరాళం ప్రకటించారు. భారతీయ సోదరులకు అండగా ఉండాల్సిన బాధ్యత ప్రతి యూఏఈ పౌరుడికి ఉందంటూ ఆర్థిక సాయానికై పిలుపునిచ్చారు. కేరళకు సాయం చేసేందుకు ఓ ఎమర్జెన్సీ కమిటీని కూడా ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు.

కేరళకు దుబాయ్‌కి ఇదివరకే అవినాభావ సంబంధం ఉంది. ఉపాధి కోసం కేరళ వాసులు ఎక్కువగా యూఏఈకి వలస వెళుతుంటారు. కేరళ ప్రభుత్వం నిర్వహించే సమావేశాలకు యూఏఈ అధికారులు వస్తుంటారు. కాగా గల్ఫ్ దేశమైన ఖతర్‌ కేరళకు ఇంతకుముందు రూ.35 కోట్ల ఆర్థిక సాయం అందించింది.