ఆ ఘనత వాజ్‌పేయిదే : ప్రధాని నరేంద్ర మోడీ

vajpayee-never-buckled-under-pressure-pm-modi

రాజీ ఎరుగని నేతగా వాజ్‌పేయిని అభివర్ణించారు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ.. ఢిల్లీలో జరిగిన వాజ్‌పేయి సంస్మరణ సభలో ప్రధాని పాల్గొని ప్రసంగించారు. ఈ కార్యక్రమానికి పలు పార్టీల నేతలు హాజరయ్యారు.. ఈ సందర్భంగా వాజ్‌పేయితో అనుబంధాన్ని గుర్తు చేసుకుని అద్వానీ భావోద్వేగానికి లోనయ్యారు.

వాజ్‌పేయి సిద్ధాంతాలతో ఎప్పుడూ రాజీపడ లేదని ప్రధాని మోడీ అన్నారు. అత్యంత విలువలతో కూడిన పార్లమెంటేరియన్‌గా పార్లమెంటరీ సంప్రదాయాలకు వన్నెలద్దారని కొనియాడారు. ఢిల్లీలోని ఇందిరాగాంధీ ఇండోర్ స్టేడియంలో వాజ్‌పేయి సంస్మరణ సభ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ, కాంగ్రెస్‌ సహా పలు పార్టీల నేతలు పాల్గొన్నారు. వాజ్‌పేయి సేవలను స్మరించుకున్నారు.

భారత్‌ను అణుశక్తి దేశంగా రూపొందించిన ఘనత వాజ్‌పేయిదేనని ప్రధాని అన్నారు. కాశ్మీర్ అంశంపై ఇండియాను ఎవరూ ఇరకాటంలో పెట్టేందుకు వీలులేని విధంగా భారత వైఖరిని, వాస్తవాలను సమర్ధవంతంగా బయట ప్రపంచానికి వాజ్‌పేయి చాటిచెప్పారని మోడీ కితాబిచ్చారు.

అటల్ జీతో తనకు 65 ఏళ్ల స్నేహ బంధముందని బీజేపీ సీనియర్ నేత అద్వానీ అన్నారు. ఆయనతో కలిసి చేయడం, ఎన్నో అనుభవాలను పంచుకోవడాన్ని అదృష్టంగా భావిస్తున్నానన్నారు. వాజ్ పేయి మార్గం అనుసరణీయమని తెలిపారు. వాజ్‌పేయి మరణంతో రాజకీయ వ్యవస్థలో శూన్యత ఏర్పడిందన్నారు.

ఇక వాజ్‌పేయితో ఉన్న అనుబంధాన్ని ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్‌తో పాటు కాంగ్రెస్ నేత గులాంనబీ ఆజాద్‌ గుర్తు చేసుకున్నారు. అటల్‌జీ మార్గం అనుసరణీయమని వారంతా పేర్కొన్నారు.

- ఉచితంగా మీ జాతకాన్ని తెలుసుకోండి -