భర్త లైంగిక వేధింపులు భరించలేక భార్య..

భార్యా భర్తలు ప్రేమకు ప్రతిరూపాలుగా ఉండాలి. ఒకరిపై ఒకరు ఇష్టంగా ఉండాలి. అర్థం చేసుకోవాలి. ఆలోచనలను పంచుకోవాలి. ఆనందంగా గడపవలసిన క్షణాల్ని ఒకరిపై ఒకరు అజమాయిషీ చేసేలా ఉండకూడదు. అది కాస్తా శృతి మించి అనర్థాలకు దారి తీసి ఆత్మహత్యకు ప్రయత్నించింది బెంగుళూరుకు చెందిన ఓ మహిళ.

ఓ ప్రైవేటు పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా పనిచేస్తున్న ఆమెకు భర్త, ఆరేళ్ల పాప ఉన్నారు. భర్త లైంగికంగా వేధిస్తున్నాడంటూ సంవత్సరకాలంగా కూతురితో తల్లిదండ్రులవద్ద ఉంటోంది. ఓ రోజు కూతుర్ని చూసేందుకు వచ్చిన భర్త తనను కొట్టి, తన పట్ల పశువులా ప్రవర్తించాడని ఆవేదన చెందింది. అతడు వెళ్లపోయిన తరువాత చేతి నరాలు కోసుకుని, నిద్ర మాత్రలు మింగి ఆత్మహత్యకు ప్రయత్నించింది.

అపస్మారక స్థితిలో పడిఉన్న అక్కను చూసిన చెల్లెలు వెంటనే ఆసుపత్రికి తీసుకువెళ్లింది. ప్రస్తుతం వైద్యుల పర్యవేక్షణలో ఉన్న ఆమె కోలుకుంటోంది. తనపై భర్త చేస్తున్న లైంగిక వేధింపుల పట్ల పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు భర్తను అరెస్టు చేసి విచారిస్తున్నారు.