బుమ్రా మ్యాజిక్‌..గెలుపు అంచున భారత్‌

మూడో టెస్టులో భారత్ అడుగు దూరంలో నిలిచింది. నాలుగో రోజే మ్యాచ్‌ ముగించేద్దామన్న కోహ్లీ సేన ఆశలపై.. ఇంగ్లండ్‌ టీమ్ నీళ్లు చల్లింది. చివర్లో భారత బౌలర్లకు గట్టిపోటీ ఇచ్చింది. భారీ టార్గెట్ లక్ష్య ఛేదనలో.. 9వికెట్లకు 311పరుగులు చేసింది. బట్లర్‌ 106 పరుగులు, స్టోక్స్‌ 62 పరుగులతో కీలక ఇన్నింగ్స్‌ ఆడారు. ప్రస్తుతం క్రీజులో రషీద్‌ , ఆండర్సన్‌ ఉన్నారు. విజయానికి ఇంగ్లండ్ టీమ్ ఇంకా 210 పరుగులు వెనకబడి ఉంది. మ్యాచ్ ప్రారంభంలో పేసర్ల విజృంభణకు ఇంగ్లండ్‌ తొలి సెషన్‌లోనే 62 పరుగులకు నాలుగు వికెట్లు కోల్పోయింది. ఈ దశలో బట్లర్‌, స్టోక్స్‌ అద్భుత ఆటతీరును కనబరుస్తూ సెంచరీ భాగస్వామ్యంతో భారత బౌలర్లకు చుక్కలు చూపించారు. చివరి సెషన్‌లో బుమ్రా కొత్త బంతితో మాయ చేస్తూ ఐదు వికెట్లతో రాణించినా టెయిలెండర్లు పట్టు వీడకపోవడంతో మ్యాచ్‌ ఫలితం కోసం భారత్‌ ఇవాళ ఆడక తప్పడం లేదు.

23 పరుగుల ఓవర్‌నైట్‌ స్కోరుతో నాలుగో రోజు రెండో ఇన్నింగ్స్‌ ఆరంభించిన ఇంగ్లండ్‌ టాప్‌ ఆర్డర్‌ను భారత పేసర్లు ఇషాంత్‌, బుమ్రా, షమి వణికించారు. తొలి మూడు ఓవర్లలోనే ఓపెనర్లు కుక్‌ , జెన్నింగ్స్‌ వికెట్లను ఇషాంత్‌ పడగొట్టాడు. ఈ దశలో రూట్‌ , పోప్‌ కొద్దిసేపు పోరాడారు. మూడో వికెట్‌కు 30 పరుగులను జోడించిన తర్వాత ఈ జోడీ వరుస ఓవర్లలో పెవిలియన్‌కు చేరింది. 25వ ఓవర్‌లో రూట్‌ను బుమ్రా అవుట్‌ చేయగా. ఆ తర్వాత షమి.. పోప్‌ పనిపట్టాడు. లంచ్‌ బ్రేక్‌ తర్వాత భారత బౌలర్లకు బట్లర్‌, స్టోక్స్‌ గట్టి షాక్‌ ఇస్తూ వికెట్‌ నష్టపోకుండా 89 పరుగులను జత చేర్చారు.

చివరి సెషన్‌లోనూ ఇంగ్లండ్‌ అదే ఆటతీరును కొనసాగించింది. 76వ ఓవర్‌లో బట్లర్‌ మూడు ఫోర్లు బాది కెరీర్‌లో తొలి శతకాన్ని సాధించాడు. ఆ తరువాత కొత్త బంతితో భారత్‌ చెలరేగింది. 83వ ఓవర్‌లో బుమ్రా రెండు అద్భుత ఇన్‌స్వింగర్లతో బట్లర్‌, బెయిర్‌స్టోలను పెవిలియన్‌కు చేర్చా డు. తన తర్వాతి ఓవర్‌లోనే మరో బౌన్సర్‌తో బుమ్రా.. వోక్స్‌ను అవుట్‌ చేశాడు. ఆ తర్వాత రషీద్‌, బ్రాడ్‌ చెలరేగి తొమ్మిదో వికెట్‌కు 50 పరుగులు జోడించారు. చివర్లో మూడు ఓవర్లు పొడిగించినా భారత్‌ ఆఖరి వికెట్‌ తీయలేకపోయింది.