మెకానికల్‌ స్టూడెంట్‌కు రూ.70 లక్షల వేతనం

engineering-student-bags-rs-70-lakh-annum-job

‘పట్టుదలతో చేస్తే సమరం.. తప్పకుండ నీదే విజయం.. కష్టపడితే రాదా ఫలితం’ అంటూ ఓ కవి రాసిన పాటను నిజం చేశాడు జేఎంఐ కు చెందిన యువకుడు. తన కల సాకారం చేసుకునేందుకు ఎన్నో కష్టాలు పడ్డాడు. మూడు సార్లు అనుకున్న లక్ష్యం విఫలమైంది. అయినప్పటికీ ఎక్కడా కూడా పట్టు వదల్లేదు. ఎలాగైనా తన లక్ష్యాన్ని చేరుకోవాలని నిరంతరం శ్రమించాడు. చివరకు విజయం అతనికి దాసోహం అయ్యింది. ఏకంగా ఏడాదికి రూ.70లక్షల జీతం గల ఓ ఉద్యోగం అతని ఇంటితలుపు తట్టింది. ఇంతకీ ఆ విద్యార్థి ఎవరో తెలుసా! ఒక సాదాసీదా ఎలక్ట్రిషియన్‌ కొడుకు. జామియా మిల్లియా ఇస్లామియాకు చెందిన యువకుడు. అతని పేరు మహమ్మద్ అమీర్ అలీ.

జేఎంఐలో ఇంజనీరింగ్‌ చదవాలని అతని కోరిక. అందుకు మూడు సార్లు ప్రయత్నించి విఫలమయ్యాడు. అయినా పట్టుదలతో ముందుకు సాగాడు. ఎలాగైనా తన లక్ష్యాన్నిచేరుకోవాలని పరితపించాడు. అతని శ్రమకు ఫలితంగా జేఎంఐలో డిప్లొమాలో మెకానికల్‌ ఇంజనీరింగ్‌ అర్హత లభించింది. జేఎంఐలో సీటు దక్కించుకున్న అలీ.. నలుగురికి ఉపయోగపడేలా ఏదైనా సాధించాలనుకున్నాడు. భవిష్యత్తు తరం వారికి ఉపయోగపడే ఎలక్ట్రిక్‌ వాహనాలపై ప్రాజెక్ట్‌ వర్క్‌చేయడం ప్రారంభించాడు. భారత్‌లో ఎలక్ట్రిక్‌ వాహనాలకు సరియైన ఛార్జింగ్‌ సదుపాయాలు లేవు. అందుకే వీటిపై ఎక్కువగా ఫోకస్ చేశాడు అలీ.

ఈ ప్రాజెక్ట్‌ను అమెరికా కంపెనీ ఫ్రిసన్‌ మోటార్ వ్రెక్స్‌ గుర్తించింది. జేఎంఐ వెబ్‌సైట్‌లో ఈ ప్రాజెక్ట్‌ వర్క్‌ను చూసిన ఫ్రిసన్‌ వెంటనే యూనివర్సిటీ అధికారులను సంప్రదించింది. 1,00,008 డాలర్లు(రూ.70లక్షలు) వేతనంతో బ్యాటరీ మేనేజ్‌మెంట్‌ సిస్టమ్‌ ఇంజనీర్‌గా తన కంపెనీలో నియమించుకుంది ఫ్రిసన్‌.

జేఎంఐ ఏర్పాటు చేసినప్పటి నుంచి ఇదే అత్యధిక ప్యాకేజీ అని యూనివర్సిటీ అధికారులు తెలిపారు. పట్టుదలతో చేస్తూ ఉంటే ఏ పనైనా సాధ్యమే అని ఈ కుర్రాడు మరోసారి నిరూపించాడు.. దీంతో యువతరానికి అలీ స్టోరి స్ఫూర్తిదాయకమైంది.